- కమిషన్లతో కాలయాపన
- ఈసారి అమీతుమీ దిశగా ఉద్యమం
- 25 నుంచి సత్యాగ్రహ పాదయాత్ర
- కాపు జేఏసీ నాయకులు
అనాదిగా కాపులకు అన్యాయం
Published Wed, Jan 18 2017 10:17 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
కొత్తపేట :
కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై అనాదిగా వివిధ ప్రభుత్వాలు కమిషన్లతో కాలయాపన చేసి మోసం చేశాయని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి బుధవారం కొత్తపేటలో కాపునాడు నాయకుడు చీకట్ల ప్రసాద్ గృహంలో సమావేశమయ్యారు. నెల 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ నిర్వహించే పాదయాత్రపై పలువురు నాయకులు, సభ్యులతో సమీక్షించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ కాపులకు బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణకు గతంలో పలు ప్రభుత్వాలు కమిషన్లు వేసి చేతులు దులుపుకొన్న మాదిరిగానే ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు పాదయాత్రలోనూ, ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయడానికీ హామీ ఇచ్చి గాలికొదిలేసారని విమర్శించారు. ఆ హామీని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే వివిధ రూపాల్లో ఉద్యమం చేపట్టాం తప్ప తాము ఏ కులానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారు. బీసీల ఆందోళన, అనుమానాలపై ముద్రగడ వివరణ ఇచ్చి, సందేహాలను నివృత్తి చేయడంతో వారు సంతృప్తి చెందారన్నారు.
అనుమతి లేని పాదయాత్రను అడ్డుకుంటామని హోంమంత్రి రాజప్ప చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో నిర్వహించిన పలు పాదయాత్రలకు, టీడీపీ జనచైతన్య యాత్రలకు అనుమతులున్నాయా? అని ప్రశ్నించారు. ఉంటే వాటి నకళ్లు చూపితే తాము కూడా పర్మిష¯ŒS కోరే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. ఈ నెల 25న గాంధీజీ చిత్రపటంతో శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాపుల వల్లే అధికారంలోకి వచ్చామని చెప్పిన చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలని కోరారు. ఈ సారి అమీతుమీ తేల్చుకునే దిశగా ఉద్యమం చేపడతామని చెప్పారు. సమావేశంలో కాపు మహిళా విభాగం నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి, నాయకులు ముత్యాల వీరభద్రరావు, పప్పుల వెంకటరామదొర, బొరుసు సత్తిబాబు, చీకట్ల ప్రసాద్, సలాది చిన్ని, సలాది బ్రహ్మాజీ, పెదపూడి త్రిమూర్తి శ్రీనివాస్, పేపకాయల బ్రహ్మానందం, దుప్పలపూడి మాధవరావు, తోరాటి శ్రీనివాసరావు, అన్యం సత్తిరాజు, యర్రంశెట్టి నాయుడు, ముద్రగడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement