జీహుజూర్‌ | 29 tmc water released | Sakshi
Sakshi News home page

జీహుజూర్‌

Published Wed, Nov 16 2016 11:15 PM | Last Updated on Fri, Jun 1 2018 8:33 PM

జీహుజూర్‌ - Sakshi

జీహుజూర్‌

– టీడీపీ నేతలకు తొత్తులుగా పనిచేస్తున్న కీలక అధికారులు
–  ఇష్టారాజ్యంగా హంద్రీ–నీవా నీటి వినియోగం
– హెచ్చెల్సీకి 10.5, హంద్రీ-నీవాకు 18.5 కలిపి మొత్తం 29 టీఎంసీలు జిల్లాకు చేరిన వైనం
– అయినా 1.15 లక్షల ఎకరాల్లో ఆయకట్టు బీడు
– జీబీసీతో పాటు శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి
– హంద్రీ–నీవా నీటి ఖర్చు రూ.222 కోట్లు
–ఈ నీటిని ఒక్క ఎకరాకూ ఇవ్వలేదు
–ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయడంలో అధికారులు విఫలం


సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి పూర్తిగా వత్తాసు పలుకుతోందా? వాస్తవలతో సంబంధం లేకుండా వారి ఆదేశాలకు 'జీహుజూర్‌' అంటోందా? అధికార యంత్రాంగం వైఫల్యంతో 'అనంత'లో పాలెగాళ్ల రాజ్యం నడుస్తోందా? ఈ వైఖరితో లక్షలాదిమంది రైతుల భవిష్యత్తు అంధకారం అవుతోందా? కళ్లెదుటే నీటిపరవళ్లు కన్పిస్తోన్నా పొలాలకు పారించుకోలేని నిస్సహాయస్థితిలో రైతులు ఉన్నారా? వారి బాగోగుల కంటే అధికారపార్టీ మెప్పే ధ్యేయంగా అధికారులు పనిచేస్తున్నారా?.. హెచ్చెల్సీ, హంద్రీ–నీవా నీటి వినియోగం లెక్కలు, రైతులకు జరిగిన అన్యాయం బేరీజు వేసుకుంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాకు 29 టీఎంసీల నీళ్లు వచ్చినా అధికారులు మాత్రం ఆయకట్టును బీడుగా పెట్టారు.

        తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ద్వారా ఈసారి జిల్లాకు 10.5 టీఎంసీల నీళ్లు చేరాయి. హంద్రీ–నీవా ద్వారా ఇప్పటి దాకా 18.5 టీఎంసీలు వచ్చాయి. అంటే మొత్తం 29 టీఎంసీలు  చేరాయి. హెచ్చెల్సీ కింద అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌జిల్లాల్లో 2.84లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో అత్యధికంగా 'అనంత'లోనే 1.45లక్షల ఎకరాలు ఉంది. ఒక టీఎంసీ నీరు 10వేల ఎకరాల వరికి ఇవ్వొచ్చు. ఆరు తడి పంటలైతే 20వేల ఎకరాలకు ఇవ్వొచ్చు. ఈ లెక్కన 29 టీఎంసీలతో మూడు జిల్లాల్లో 2.84 లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటిని ఇవ్వొచ్చు.

కానీ 'అనంత' అధికారులు జిల్లాలోని 1.45 లక్షల ఎకరాలలో 1.15లక్షల ఎకరాలకు నీళ్లివ్వకుండా పొలాలను బీడుగా మార్చారు. హెచ్చెల్సీ, జీబీసీ, ఎంపీఆర్‌ పరిధిలోని సౌత్, నార్త్, తాడిపత్రి బ్రాంచ్‌కెనాల్‌తో పాటు పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు సమృద్ధిగా నీరిచ్చే వనరులు జిల్లాలో ఉన్నాయి. అయినప్పటికీ  ప్రణాళిక లేకుండా, ప్రాధాన్యతా క్రమం పాటించకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరించారు. 'నీరివ్వండి మహా ప్రభో!' అని పలుసార్లు వేలాది మంది రైతులు ఆందోళనలు చేపట్టినా కనికరం చూపలేదు. అధికార పార్టీ నేతలు ఎవ్వరి ఆదేశాలతో పనిలేకుండా, ఆయకట్టును పట్టించుకోకుండా చెరువుల పేరుతో విచ్చలవిడిగా  నీటిని తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.  

హంద్రీ–నీవా నీటి విలువ రూ.222 కోట్లు
    శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ఉన్న కర్నూలు జిల్లా మల్యాల నుంచి జిల్లాలోని బెళుగుప్ప మండలంలో గల జీడిపల్లి రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీరు ఎత్తిపోయాలంటే రూ.12కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. ఈ లెక్కన జిల్లాకు చేరిన 18.5 టీఎంసీల విలువ రూ.222కోట్లు.  జనవరి వరకూ నీటిని తీసుకునే అవకాశం ఉంది. మరో 7–10 టీఎంసీలు రావొచ్చు. ఇంతటి విలువైన నీటిని ప్రణాళిక లేకుండా వృథా చేశారు. హెచ్చెల్సీ నీటిని రాయదుర్గం, ఉరవకొండ పరిధిలో కొద్దిమేర ఆయకట్టుకు ఇచ్చారు. జీబీసీ పరిధిలో 50వేల ఎకరాలు, దిగువ ప్రాంతమైన ఎంపీఆర్‌ పరిధిలో 90వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రెండికి నెలకిందట నీళ్లు ఇచ్చి ఉంటే వేరుశనగతో పాటు అన్ని రకాల పంటలను రబీలో సాగు చేసేవారు. అయితే..అధికారులు పట్టించుకోలేదు.

ఎంపీఆర్‌ పరిధిలోని సౌత్, నార్త్‌ కెనాల్‌ ఆయకట్టుకు నీళ్లిచ్చి శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల రైతులను ఆదుకోవాలని  ధర్నాలు చేశారు. అయినా చుక్కనీరు విడుదల చేయలేదు. రాప్తాడు, ధర్మవరంతో పాటు పలు నియోజకవర్గాల్లో చెరువుల కోసమంటూ నీటిని తరలించారు. 18.5 టీఎంసీలు చెరువులకు ఇచ్చారా? ఆయకట్టుకు ఇవ్వాల్సిన నీటిని వాటికి ఎందుకు మళ్లించారు?  చెరువులకు, ఆయకట్టుకు మధ్య ప్రాధాన్యతను గుర్తించలేని స్థితిలో అధికారులు ఉన్నారా?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రైతుసంఘాలు నిలదీస్తున్నాయి. సౌత్, నార్త్‌ కెనాళ్లకు ఇప్పడు నీళ్లిచ్చినా ఆరుతడి పంటలు పండించే అవకాశముది. కానీ ఆ దిశగా ఆలోచించడం లేదు.

పోనీ ప్రజాప్రతినిధులైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. నీళ్లు అవసరమున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రైతులకు నీళ్లిప్పించే బాధ్యతను మాత్రం వారు విస్మరించారు. గతంలో హెచ్చెల్సీకి 26టీఎంసీలు వచ్చినప్పుడు ఆయకట్టుకు ఇచ్చి, చెరువులను నింపి, తాగునీటి అవసరాలకూ  నిల్వ ఉంచేవారు. ఇప్పుడు అంతకుమించి నీరొచ్చినా ఆయకట్టుకు ఇవ్వలేకపోతున్నారు. అధికార పార్టీ నీడ నుంచి అధికార యంత్రాంగం బయటకు వచ్చి రైతుల ప్రయోజనాలు కాపాడాలని రైతుసంఘాలు అభ్యర్థిస్తున్నాయి. లేదంటే అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement