అయినవారమైనా అంతేనా?
అయినవారమైనా అంతేనా?
Published Fri, Jun 16 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
రెండేళ్లుగా పదోన్నతుల్లేవు
కాసులు రాల్చందే పనులు జరగడం లేదు
సాంఘిక సంక్షేమశాఖ నాలుగో తరగతి ఉద్యోగుల ఆవేదన
నాలుగోతరగతి ఉద్యోగులు అన్ని విధాలా అణచివేతకు గురవున్నారు. వారికి దక్కాల్సిన పదోన్నతులు లభించడం లేదు. ప్రతీ పనికీ.. వార్షిక ఇంక్రిమెంట్లను పొందేందుకు సైతం ముడుపులు ముట్టజెప్పాల్సి వస్తోంది. దాంతో వారు పోరుబాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు.
భానుగుడి (కాకినాడ): సాంఘిక సంక్షేమ శాఖలోని నాలుగో తరగతి ఉద్యోగులు అన్ని విధాలా దోపిడీకి గురవుతున్నారు. పై అధికారులు వారిని సొంత పనులకు సైతం వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అవి అలాగుండగా పై స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు అందరూ పైసలు ఇవ్వనిదే ఫైలు కదపడం లేదని నాలుగోతరగతి ఉద్యోగులు వాపోతున్నారు. పదవీ విరమణ పొందితే వచ్చే ప్రభుత్వ ప్రయోజనాలకు రూ.20 వేలు, చనిపోయిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తే రూ. 50 వేలు.. ఇలా ప్రతీ పనికి ఓ రేటును నిర్ణయించి సొమ్ములు గుంజుతున్నారని 4వ తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.
రెండేళ్లుగా ప్రమోషన్లు లేవు
సాంఘిక సంక్షేమ శాఖలో ప్రస్తుతం ఉన్న 87 వసతి గృహాల్లో వివిధ క్యాడర్లలో 156 మంది నాలుగో తరగతి ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ రెండేళ్లుగా ప్రమోషన్లు లేవు. జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇస్తే కుక్, కమాటీ, వాచ్‌మన్‌లుగా పనిచేసే సిబ్బందిలో డిగ్రీ పూర్తిచేసిన వారికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలన్న నిబంధన ఉంది. అయితే సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. దాంతో అనేకమంది ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బందిగానే పదవీ విరమణ పొందాల్సి వస్తోంది.
కలెక్టర్‌కు ఫిర్యాదు:
సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగుల బదిలీలు, నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించకపోవడం తదితర సమస్యలపై గత నెల 28న జాయింట్ కలెక్టర్‌కు ఆ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారుల స్పందించకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
సమస్యలపై పోరాటాలకు సిద్ధం
సాంఘిక సంక్షేమ శాఖలో నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలపై, అధికారుల అవినీతిపై పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులందరికీ దీనిపై ఫిర్యాదు చేశాను. రెండేళ్లుగా పదోన్నతులు లేవు. ఖాళీలు భర్తీ చేయడం లేదు. విద్యార్హతలుండీ పదోన్నతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం.
ఖండవల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కోశాధికారి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం
Advertisement
Advertisement