మా గోడు పట్టించుకోం‍డి | out sourcing employees problem | Sakshi
Sakshi News home page

మా గోడు పట్టించుకోం‍డి

Published Fri, Jun 16 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

మా గోడు పట్టించుకోం‍డి

మా గోడు పట్టించుకోం‍డి

రోడ్డున పడ్డ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది
పదేళ్లుగా పనిచేయించుకున్నారు
జిల్లా వ్యాప్తంగా ఖాళీల భర్తీకి వినతి   
కొత్తపేట :  బాబు వస్తే.. జాబు వస్తుందని ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టాక..బాబు వస్తే జాబు రావడం మాటెలా ఉన్నా  ఉన్న జాబులు ఊడిపోవడం ఖాయమనే విధంగా తయారైంది పాలన. ‘బాబుగారి మాటలకు అర్థాలే వేరులే అన్నది అక్షరాలా సత్యమని రుజువు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక్కొక్క శాఖలో ఉద్యోగాలు ఊడ పీకేస్తూ వారి పొట్ట కొడుతూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పనిచేస్తున్న సుమారు 800 మంది ఆరోగ్య మిత్రలను ఈ ప్రభుత్వం తొలగించగా వారు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో స్టే ఆర్డర్‌ ద్వారా కొనసాగుతున్నారు. తాజాగా అదే శాఖ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇటీవల జనరల్‌ ట్రాన్స్‌ఫర్స్‌ కారణంగా జిల్లాలో 5 ఆస్పత్రుల్లో పని చేస్తున్న 15 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది రోడ్డున పడ్డారు. వారిలో 9 మంది కొత్తపేట సీహెచ్‌సీ సిబ్బందే ఉన్నారు. వారిలో స్టాఫ్‌ నర్సులు ఐదుగురు, ల్యాబ్‌ టెక్నీషియన్, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, డ్రైవర్‌ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అలాగే పెద్ధాపురం సీహెచ్‌సీ నుంచి ముగ్గురు, అమలాపురం, రామచంద్రపురం ఏరియా ఆస్పత్రులు, అనపర్తి సీహెచ్‌సీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాలు కోల్పోయారు. జనరల్‌ ట్రాన్స్‌ఫర్స్‌తో రాజమహేంద్రవరం, అమలాపురం, తణుకు ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ సిబ్బంది, పైఆస్పత్రులను కోరుకోవడంతో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగిస్తూ వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో సుమారు పదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడ్డాయి. జిల్లాలో వివిధ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీల్లో ఈ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోకుండా పొట్టకొట్టింది. ఆ బాధితులు ఉద్యోగ సంఘాల ద్వారా ఈ నెల 14 న వైద్య విధాన పరిషత్‌ జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి రమేష్‌ కిషోర్‌ను కలిసి తమను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎక్కడో చోట ఉద్యోగం ఇప్పించి ఉపాది కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని ఉపాధి కల్పించాలని వారు కోరారు.
షెడ్డుకు చేరిన అంబులెన్సు...
ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేసిన డ్రైవర్‌ చేతిలో పని చేసిన అంబులెన్స్‌ రెగ్యులర్‌ డ్రైవర్‌ వచ్చాక రిపేర్ల పేరుతో షెడ్డుకు చేరింది. కొత్తపేట ఆస్పత్రికి ఉన్న అంబులెన్స్‌ పాతదైనా సేవలందిస్తుంది. ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్‌తో ఈ నెల 5న కూడా అత్యవసర పరిస్థితిలో పేషెంటును రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. 6న వచ్చిన రెగ్యులర్‌ డ్రైవర్‌కు అది పనిచేయలేదు. రిపేర్లు చేయించాలని అమలాపురం షెడ్డుకు చేర్చారు. ఎప్పటి నుంచో ఇక్కడ మరో అంబులెన్సు ఆవశ్యకత ఉంది. ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు రెగ్యులర్‌ డ్రైవర్‌ రాకతో ఉన్న అంబులెన్సు కూడా షెడ్డుకు చేరి, అసలు అంబులెన్సే లేకుండా పోయిందని పలువురు స్థానికులు వాపోయారు.
మళ్లీ ఉద్యోగాలు ఇప్పించండి
సుమారు పదేళ్లుగా ఈ ఉద్యోగాలను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. మరే పనీ చేసుకోలేని తమకు మళ్లీ తమ ఉద్యోగాలు ఇప్పించి ఆదుకోవాలి. జిల్లాలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెళ్లి పనిచేసుకుంటాం. ఉపాధి కల్పించండి.
- ధర్నాల బూరిబాబు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి, కొత్తపేట 
న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా
ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులన్నీ ఖాళీలుగా చూపించడం వల్ల రెగ్యులర్‌ స్టాఫ్‌తో భర్తీ చేయాల్సి వచ్చింది. ఉపాధి కోల్పోయిన  సిబ్బందికి మళ్లీ పోస్టింగ్‌ల కోసం కమిషనర్‌కు లేఖ పంపించాం. అక్కడ పరిశీలనలో ఉంది. ఖాళీల్లో వారికి అవకాశం కల్పించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. 
       - రమేష్‌కిషోర్, డీసీహెచ్‌ఎస్, రాజమహేంద్రవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement