తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెల మొత్తానికి 55,669 ఆర్జిత సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ సుప్రభాతం-6279, అర్చన- 130, తోమాల -130, విశేషపూజ-1875, అష్టదళ పాద పద్మారాధన -100, నిజపాద దర్శనం -1500, కల్యాణోత్సవం-11,625, వసంతోత్సవం -11,610, ఆర్జిత బ్రహ్మోత్సవం-6020, సహస్రదీపాలంకరణ సేవ-13,300, ఊంజల్‌సేవ-3100 ఉన్నాయని వివరించారు.
ఈ టికెట్లను టీటీడీ ఈ-దర్శన్‌లోనూ భక్తులకు అందుబాటులోకి తీసురానున్నామన్నారు. వేసవి రద్దీ దృష్ట్యా ఈ నెల 15 నుంచి జూన్ ఆఖరి వరకు శుక్రవారాల్లో ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపారు. అదే రోజుల్లో వికలాంగులు, వృద్ధులను మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నామన్నారు.
శ్రీవారి సేవకు వచ్చేవారి కోసం త్వరలోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. తిరుమలలోని కల్యాణవేదికలో ‘కల్యాణం’పేరుతో ఉచిత వివాహ తేదీ రిజర్వు చేసుకోవడం కోసం త్వరలో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అన్నప్రసాదానికి దుబాయి భక్తుడి విరాళం
టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు శుక్రవారం ఓ భక్తుడు రూ.1.32 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశాడు. దుబాయికి చెందిన శేలేష్‌కుమార్ దాస్ శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈవో సాంబశివరావును కలసి రూ.1.32కోట్ల రూపాయల చెక్‌ను అందజేశారు. స్వామి వారి అన్నదాన పథకానికి వినియోగించాలని కోరారు.