ఏయ్ కలెక్టర్.. ఇంకెవరు చేస్తారు?
నిరంతరాయంగా 7 గంటల విద్యుత్
♦ త్వరలో అమలు చేస్తామన్న సీఎం
♦ దూబగుంట్ల జన్మభూమి సభలో పాల్గొన్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రైతులకు నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్‌ను ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని దూబగుంట్ల గ్రామంలో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంతో పాటు పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామంలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాతనలో గృహాలకు రూ.20లకు రెండు ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెవెన్యూశాఖలో కొద్ది మంది ఉద్యోగుల వల్ల భూ వివాదాలు తలెత్తుతున్నాయని విమర్శించారు.
ఇందుకోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాయలసీమకు అన్యాయం జరిగిపోతోందని కొందరు రాజకీయ నిరుద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. తాను రాయలసీమలోనే పుట్టానని.. చివరి రక్తపు బొట్టు వరకు రాయలసీమకు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని భరోసానిచ్చారు.
ఏయ్ కలెక్టర్.. ఇంకెవరు చేస్తారు?
బనగానపల్లె నియోజకవర్గంలో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి తన కుమారుడు రూ.25 లక్షలు ఇస్తున్నారని.. ఇందుకు ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాలని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టించమన్నాముగా అంటూ.. ఏయ్... కలెక్టర్ అని సంబోధించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఇంకా నిర్మించలేదా? అని ప్రశ్నించారు. ఇందుకు కలెక్టర్ ఏదో సమాధానమివ్వగా.. ‘ఇంకెవ్వరు చేస్తారు.. నీవే కదా చేయాల్సింది’ అని ఆగ్రహించారు. 43 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని.. ఎమ్మెల్యే ఇచ్చిన నిధులకు మరో రూ.25 లక్షలో, రూ.50 లక్షలో ఇస్తామని సీఎం ప్రకటించారు. నిన్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు సభలో జేసీని కూడా ఇలానే సంబోంధించారు.