8 వాహనాలు ధ్వంసం
-
ఒక్కదానికొక్కటి ఢీకొన్న వైనం
నాయుడుపేటటౌన్ : నిత్యం రద్దీగా ఉండే రహదారిపై రెప్పపాటులో రెండు లారీలు ఒక్కదానికొక్కటి ఢీకొనడంతో వాటి వెనుకనే వస్తున్న మరో 6 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన నాయుడుపేట సమీపంలోని పూతలపట్టు బైపాస్‌రోడ్డుపై బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అ తమిళనాడులోని తిరువళ్లూరు నుంచి ఓ భారీ పరికరాన్ని కంటైనర్ లారీపై గూడూరు సమీపంలోని మీనాక్షి పవర్ ప్లాంట్‌కు తరలించుకుపోతున్నారు. ఈ లారీ బైపాస్‌రోడ్డు సమీపంలో పెట్రోల్ బంకువద్ద పైన విద్యుత్ వైర్లు తగులుతుండటంతో లారీని నిలిపివేశారు. విద్యుత్ వైర్లను పైకి లేప్పి లారీని తరలించే ప్రయత్నాలు చేశారు. ఈ లారీ వెనుకనే మరో రెండు లారీలు నిలబడి ఉన్నాయి. ఈ క్రమంలో తమిళనాడులోని సెలం నుంచి వైజాగ్‌కు కెమికల్ లోడుతో వస్తున్న భారీ ట్యాంకర్ అతివేగంగా వచ్చి రోడ్డు మీద నిలబడి ఉన్న లారీలను ఢీకొంది. దీంతో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న మెకానిక్ షెడ్‌పై దూసుకువెళ్లి అక్కడ ఉన్న రెండు ఆటోలు, అంబులెన్స్ వాహనం, ట్రాక్టర్‌తో పాటు ఓ కారును ఢీకొని నిలబడిపోయింది. ఈ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో మరో పార్శిల్ లారీ మరో వైపు జనాల మీదకు దూసుకెళ్లడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి విద్యుత్ స్థంభానికి ఢీకొని నిలబడిపోయింది. ట్యాంకర్లో ఉన్న డ్రైవర్ ఎన్ దినేష్‌కు మరో పార్శిల్ లారీలో ఉన్న డ్రైవర్లు రాజన్‌బహుదూర్, రాంజత్తన్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
స్తంభించిన ట్రాఫిక్
భారీ పరికరంతో వచ్చిన వాహనం రోడ్డు మధ్యలో నిలబడి ప్రమాదానికి కారణం కావడమేగాక వాహనాలు ధ్వంసమై నిలబడిపోవడంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మారుతీకృష్ణతో పాటు ఏఎస్‌ఐలు కృష్ణయ్య, శంకర్‌రాజు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రహదారిపై అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి ప్రధాన కారణమైన భారీ పరికరం తీసుకు వస్తున్న వాహన డ్రైవర్ విఘ్నేశ్వర్‌తో పాటు ట్యాంకర్ డ్రైవర్ దినేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.