టెన్షన్ పడకుండా..
♦ తొలిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతం
♦ 99 శాతం మంది విద్యార్థుల హాజరు
♦ మొత్తం విద్యార్థులు: 98,114
♦ హాజరైనవారు: 97,757 గైర్హాజరు: 357
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పదేపదే ప్రకటనలు ఇవ్వడం, మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో విద్యార్థులు జాగ్రత్త పడ్డారు. చాలా మంది ఉదయం 8 గంటలకే కేంద్రాల వద్దకు చే రుకున్నారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. విద్యార్థుల వెంట వచ్చిన వారు పరీక్ష ముగిసేంత వరకు అక్కడే నిరీక్షించారు. ఒక వైపు భానుడి భగభగ.. మరోపైపు కూర్చోవడానికి కాసింత జాగా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రథమ భాష పేపర్-1 పరీక్షకు జిల్లాలో 98,114 హాజరుకావాల్సి ఉండగా.. 97,757 (99 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. 357 మంది గైర్హాజరయ్యారు. జిల్లా పరిధిలో 114 కేంద్రాల్లో తనిఖీ బృందాలు తిరిగాయని డీఈఓ రమేష్ వెల్లడించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని తెలిపారు.