విద్యార్థుల ఆత్మహత్యలు | Student's Suicide in Chennai | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆత్మహత్యలు

Published Sat, May 10 2014 11:35 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

Student's Suicide  in Chennai

 సాక్షి, చెన్నై : చక్కటి భవిష్యత్తుకు పునాదులు వేసుకునే లక్ష్యంతో నేటి విద్యార్థులు ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ప్లస్‌టూ పాసైన వెంటనే తవుకు కలల జీవితాన్ని ప్రసాదించే కెరీర్ వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. నేటి తరం విద్యార్థులు చక్కటి కెరీర్ ఎంచుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకుంటే మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ రుగ్మత నుంచి విద్యార్థులను బయట పడేయడానికి చర్యలు తీసుకుంటున్నా, ఫలితం శూన్యం. పరీక్షలు తప్పితే చాలు, తక్కువ మార్కులు వస్తే చాలు, తోటి విద్యార్థుల ఎదుట చులకనకు గురవుతామని, లేదా, తల్లిదండ్రులు ఏమంటారేమోనన్న మనో వేదనతో తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. శుక్రవారం ప్లస్ టూ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయో లేదో ఫెయిలైన, మార్కులు తగ్గిన విద్యార్థులు ఆత్మహత్యల బాట పట్టి, తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చారు.
 
 ఒక రోజులోనే...: గత ఏడాది ఫలితాలు వెలువడ్డ నాలుగైదు రోజుల వ్యవధిలో సుమారు పది మంది విద్యార్థుల వరకు ఆత్మహత్య చేసుకుని ఉండగా, ఈ ఏడాది ఫలితాలు వెలువడ్డ ఒక్క రోజులో ఆరుగురు మృతి చెందారు. మరో పదమూడు మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శ్రీ పెరంబదూరుకు చెందిన కూలీ కుమార్తె కౌసల్య గణితంలో తప్పింది. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చినా గణితం తప్పడంతో శుక్రవారం అర్ధరాత్రి విషం తాగింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పల్లికరనైకు చెందిన సుకన్య , ఊటీకి చెందిన కవిత పరీక్షల్లో తప్పడంతో ఉరేసుకుని మృతి చెందారు. తిరువారూర్‌కు చెందిన  లక్షాదిపతి కుమార్తె అఖిల పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, తక్కువ మార్కులు వచ్చాయన్న వేదనతో ఆత్మాహుతి చేసుకుంది. వేలూరుకు చెందిన గుణ శీలన్ 1,107 మార్కులు సాధించినా, తనకు తక్కువ మార్కులు వచ్చాయని, తోటి విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అనుమానా స్పద స్థితిలో అతడి మృతదేహాన్ని సమీపంలోని బావిలో ఉదయం గుర్తించారు. సేలం జిల్లా ఏర్కాడుకు చెందిన సుధా పలు మార్లు పరీక్షల్లో తప్పడంతో విరక్తితో ఉరేసుకుని తనువు చాలించింది.
 
 ఆస్పత్రుల్లో చికిత్స :  చెన్నై జాంబజార్‌కు చెందిన శివకుమార్ పరీక్షల్లో 780 మార్కులు సాధించాడు. అయితే, తక్కువ మార్కులు వచ్చాయన్న వేదనతో తమ ఇంటి డబా మీద నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాయ్యూడు. బన్రూటి సమీపంలోని గౌండం పాళయంకు చెందిన రాంకీ పరీక్ష తప్పడంతో విషం తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని కడలూరు ఆస్పత్రికి తరలించారు. చిన్న కంచికి చెందిన సుడలి పరీక్ష తప్పడంతో ఉరి వేసుకుంది. అరుుతే కుటుంబీకులు గుర్తించడంతో రక్షించుకోగలిగారు. కొన ఊపిరితో ఉన్న ఆ విద్యార్థినిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. విరుదునర్, మదురై, తదితర ప్రాంతాల్లో పరీక్ష పాస్ అయినా, మార్కులు తక్కువగా వచ్చాయన్న వేదనతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆధారంగా మొత్తం 13 మంది విద్యార్థులు ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు పేర్కొంటున్నారు.
 
 కౌన్సెలింగ్: పరీక్షల్లో తప్పినంత మాత్రాన ఆత్మహత్యలకు పాల్పొడొద్దని వైద్య నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు. పరీక్ష తప్పినా, మళ్లీ రాసుకునే అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి గురై ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. విద్యారిథ ఎవరైనా మనో వేదనతో ఉన్నట్టుగా ఉంటే 104 నెంబర్‌కు డయల్ చేయాలని, మానసిక వైద్య నిపుణులు తమ సూచనలు, సలహాలతో వారిలో మనో ధైర్యాన్ని నింపుతారని ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చెన్నైలోని సేవా సంస్థ సైతం విద్యార్థుల్లోని మనో వేదనను పారదోలడానికి తమ నెంబర్ ప్రకటించింది. 044- 24640050 నెంబర్‌ను సంప్రదించిన వారికి తమ వంతుగా సూచనలు, సలహాలతో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement