
అధికంగా మద్యం సేవించిన యువకుడి మృతి
భువనగిరి అర్బన్ : మద్యం అధికంగా సేవించడంతో యువకుడు మృతి చెందిన సంఘటన భువనగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిర నగర్‌కు చెందిన బుచ్చాల శంకరయ్య, రాజమ్మ దంపతుల రెండో కుమారుడు చిరంజీవి(27) కూలి పని చేస్తున్నాడు. రోజులాగే శనివారం ఉదయం కూడా పని వెళ్లాడు. సాయంత్రం పని ముగించుకొని వస్తూ పట్టణంలోని వినాయక చౌరస్తాలో ఉన్న ఓ బార్‌లోకి వెళ్లి అధికంగా మద్యం సేవించాడు. దీంతో ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉన్న చిరంజీవి ఆ బారు ముందు ఉన్న మెట్లపై పడిపోయాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో దప్పిక వేసి మృతి చెందినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది గమనించి చూడగా మృతిచెంది ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడి చేరుకున్నారు. మృతి చెందిన తీరును పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు కిరణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పట్టణ ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు.