తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. కొన్నాళ్లుగా వీస్తున్న తూర్పు, ఈశాన్య గాలులు క్రమంగా దిశ మార్చుకుంటున్నాయి.
దక్షిణ గాలులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. కొన్నాళ్లుగా వీస్తున్న తూర్పు, ఈశాన్య గాలులు క్రమంగా దిశ మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ, దక్షిణం నుంచి ఇవి వీయడం మొదలెట్టాయి. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలులను ఇవి అడ్డుకుంటున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలి ప్రభావం తగ్గడానికి ఈ మార్పులు కారణమవుతున్నాయి. ప్రస్తుతం వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ ఆటంకాలు) పశ్చిమం నుంచి తూర్పు వైపు పయనిస్తుండటమే దక్షిణ గాలులకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
వీటి వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, చలి తగ్గినా పొగ మంచు అధికమవుతుందని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి ’కి చెప్పారు. పొగ మంచు ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణల్లో అధికంగా కనిపిస్తుందన్నారు. కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. చలి కాస్త తగ్గినా పొగమంచు వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. అందువల్ల జనం మంచులో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4, గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగాను, గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ఒకట్రెండు డిగ్రీలు తక్కువగాను నమోదవుతున్నాయి. ఈ నెల 23న తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మంగళవారం 15 డిగ్రీలు నమోదు కావడం మారిన పరిస్థితిని తెలియజేస్తోంది. గత 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంది.