ఐదురోజుల ఆడ శిశువును వదిలివెళ్లిన తల్లి
-
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి అధికారులు
తెనాలిఅర్బన్ (గుంటూరు) : పొత్తికడుపులో బాధ మెలిపెడుతున్నా.. అంతులేని ఆవేదనను మునిపంటి కింద బిగపట్టి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పురిటిలోనే వదిలేసి వెళ్లింది. పట్టుమని నాలుగు రోజులు కూడా నిండకుండా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డకు కడుపు నింపకుండా వదిలివెళ్లిందంటే ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ... ఆ పాపను చూసిన వారు మాత్రం అయ్యో పాపం... అని అనుకోక మానరు. ఈ ఉదంతం తెనాలి జిల్లా వైద్యశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. వైద్యుల కథనం ప్రకారం గత నెల 27వ తేదీన 25 ఏళ్ల వయస్సు ఉన్న గర్భిణి ప్రసవం నిమిత్తం జిల్లా వైద్యశాలకు వచ్చింది. అదే రోజు పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ప్రసవం చేసి ఆడ శిశువును బయటకు తీశారు. మంగళవారం వరకు శిశువుతో ఉన్న ఆమె అదే రోజు రాత్రి శిశువును ప్రసూతి వార్డులోనే వదిలివేసి వెళ్లిపోయింది. ఈ విషయం గమనించిన సిబ్బంది వైద్యశాల సూపరింటెండెంట్ సులోచనకు ఫిర్యాదు చేశారు. శిశువును చిక్సిత నిమిత్తం ఎస్‌ఎన్‌సీయు వార్డుకు తరలించారు. అక్కడ ఉన్న నర్సులే శిశువు ఆలనా పాలనా చూస్తున్నారు. మహిళ కోసం గాలించినా ఆమె ఆచూకీ తెలియరాలేదని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరే ముందు తన పేరు పెచ్చముడి అంజలి అని, తన భర్త పేరు గోపాల్ అని, విజయవాడ టూటౌన్ పరిధిలో నివసిస్తున్నట్లు కేస్‌షీట్‌లో పేర్కొంది. స్టాఫ్ నర్సు స్వర్ణలత, ఆర్‌ఎంవో డాక్టర్ సురేష్ త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల్లో శిశువును శిశుసంక్షేమ శాఖాధికారులకు అప్పగించే అవకాశం ఉంది.