రాష్ట్రపతి, ప్రధానికి ఘనంగా వీడ్కోలు
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకా విన్యాసాల ప్రదర్శనలో పాల్గొన్న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుగు పయనమయ్యారు. ఈ నెల 5న విశాఖపట్నానికి వచ్చిన రాష్ట్రపతి మూడు రోజుల పర్యటనను ముగించుకుని ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. నౌకాదళ విమాన స్థావరం ఐఎన్‌ఎస్ డేగా నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఉదయం 9.30 గంటలకు ఆయన పయనమయ్యారు.
విమానాశ్రయంలో రాష్ర్టపతికి గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి ఎన్.చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, నేవీ చీఫ్ ఆర్‌కే ధోవన్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా ఆదివారం సాయంత్రం ఫ్లీట్ రివ్యూలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ గౌరవ విందు స్వీకరించిన అనంతరం నేరుగా విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో రాత్రి 9.50 గంటలకు ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు వీడ్కోలు పలికారు. అదే విధంగా చంద్రబాబు రాత్రి 10.20 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు. గవర్నర్ నరసింహన్ ఆదివారం రాత్రి విశాఖపట్నంలోనే బస చేశారు. ఆయన సోమవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరి వెళతారు.