మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం | A liquid feed through pipe | Sakshi
Sakshi News home page

మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం

Published Wed, Jun 22 2016 8:42 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం - Sakshi

మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం

ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్తున్న ఆ బాలుడిపై విధి పగబట్టింది. తలకు క్రికెట్ బాలు తగలడంతో మెదడులో గడ్డకట్టి ఆరుచోట్ల ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. మూడేళ్లుగా మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్నాడు. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబ సభ్యులు  ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు.

 
* మూడేళ్లుగా మంచానికే పరిమితమైన బాలుడు
* పైప్‌ద్వారా ఆహారంగా ద్రవ పదార్థాలు
* ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

కర్నూలు : కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గడేకారి మహబూబ్‌బాషా, షేక్ ఉసేన్‌బీ దంపతులకు మౌలాలి, దస్తగిరి సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గడేకారి, కూలీపనికి వెళుతూ పిల్లలను చదివించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న దస్తగిరి స్నేహితులతో సరదాగా క్రికెట్ ఆడుతున్న సమయంలో 2013వ సంవత్సరంలో తలకు క్రికెట్ బాల్ తగిలింది.

మొదట్లో దాని ప్రభావం కన్పించకపోగా కొంతకాలానికి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు, నంద్యాల ఆసుపత్రులకు తీసుకెళ్లగా ఎక్స్‌రేలో మెదడులో గడ్డ ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు, దాతల సాయం, దొరికిన చోటంతా రూ. 2 లక్షల వరకు అప్పు చేసి హైదరాబాదులోని నిమ్స్‌లో గడ్డను తొలగించేందుకు తల, మెడ, గొంతు, తదితర చోట్ల  ఆరు ఆపరేషన్లు చేయించారు.

ఆపరేషన్ అనంతరం దస్తగిరి యథావిధిగా కోలుకుంటారని భావించారు. ఎక్కువ చోట్ల ఆపరేషన్లు జరగడంతో అప్పటి నుంచి మంచానికి పరిమితం అయ్యాడు. ఆహారపదార్ధాలను ద్రవరూపంలో ముక్కుకు అమర్చిన పైప్‌ద్వారా అందజేయాల్సి వస్తోంది. ఆడుతూ, పాడుతూ జీవనం సాగిస్తున్న  కుమారుడికి ఈ పరిస్థితి రావడంతో తండ్రి షాక్‌కు గురై.. మానసిక స్థితి సరిగా లేక ఇల్లు వదిలి వెళ్లాడు. కుమారుడి ఆలనాపాలన తల్లి చూస్తోంది. ఆమె ఇంటికే పరిమితం కావడంతో పోషణభారం పెద్దకుమారుడైన మౌలాలిపై పడింది.
 
గడేకారి పనిచేస్తూ కుటుంబ పోషణ..
తమ్ముడు అనారోగ్యంతో మంచాన పడే సమయానికి పదో తరగతి పూర్తి చేసుకున్న మౌలాలి చ దువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఇల్లు లేక వీరు.. వనం ఆంజనేయస్వామి ఆలయంలో తలదాచుకుంటూ ఉండడంతో గ్రామానికి చెందిన ఉసేనయ్య ఆదుకున్నాడు. ప్రస్తుతం హుసేనయ్య ఇంట్లో వీరు ఉంటున్నారు. మౌలాలి.. గడేకారి పనికి వెళుతూ వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ, తమ్ముడి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాడు. మాత్రలు, మందుల కోసం నెలకు రూ. 5వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది.
 
దాతల సాయం కోసం ఎదురుచూపు
మూడేళ్లుగా మంచానికే పరిమితమైన దస్తగిరికి మెరుగైన వైద్యం అందితే యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. అంతటి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. నెలకు కావాల్సిన మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని.. దాతలు ఆపన్న హస్తం అందించి కుమారుడికి పునర్జన్మను ప్రసాదించాలని తల్లి, కుమారుడు వేడుకుంటున్నారు. దాతలు సాయం చేసేందుకు  8186815860 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement