ఆరోగ్యమిత్రలపై ఉక్కుపాదం
ఉద్యోగం కోసం రోడ్డెక్కిన వారిపై పోలీస్‌మార్క్ అణచివేత
విజయవాడ: ఊడబెరికిన తమ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలంటూ రోడ్డెక్కిన ఆరోగ్యమిత్రలపై సర్కారు పోలీస్‌మార్క్ అణచివేతకు దిగింది. సోమవారం విజయవాడలోని సీఎం కార్యాలయానికి తరలివచ్చిన ఆరోగ్యమిత్రలను పోలీసులు ముందుగానే అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆరోగ్యమిత్ర కార్యకర్తల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద అప్రకటిత కర్ఫ్యూ విధించారు. వేకువనుంచే పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో మాటువేసి బస్సులు, రైళ్లు దిగిన వారిని దిగినట్లు అదుపులోకి తీసుకున్నారు.బస్సులు, రైళ్లు దిగిన వారిని తనిఖీ చేసి ఆరోగ్యమిత్ర కోటు, ఐడెంటిటీ కార్డు ఉన్నవారందరిని అదుపులోకి తీసుకున్నారు.నగరంలోని సీపీఐ కార్యాల యాన్ని చుట్టుముట్టి ఆందోళనకు బయలుదేరబోతున్న వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీఐ కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్రనాథ్ పోలీసుల చర్యలను ఖండించారు. రోడ్లపై వెళుతున్న ప్రజలను కూడా ఆరోగ్యమిత్ర కార్యకర్తలుగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది.13 జిల్లాల నుంచి విజయవాడకు వెయ్యిమందికి పైగా ఆరోగ్యమిత్రలు తరలివచ్చారు.వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని 10 పోలీస్‌స్టేషన్లకు తరలించారు.