
సాక్షి, విజయవాడ: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచార ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మానుషమైన ఘటనను నిరసిస్తూ విజయవాడ నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో లా విద్యార్థులు ఆదివారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రియాంకను కిరాతకంగా హతమార్చిన ఆ నలుగురు నేరగాళ్లను చేతనైతే చంపేయాలని, లేదా తమకు అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ యాసిడ్ దాడి సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొన్న నిర్ణయం లాంటి నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవాలని విద్యార్థులు గళమెత్తుతున్నారు. సిటీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ ర్యాలీ లో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియాంక మిస్సింగ్ కంప్లయింట్‌పై పోలీసుల వ్యవహరించిన తీరు బాధా కలిగించిందని, ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులపై స్వత్వరమే విచారణ జరిపి శిక్షించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. మహిళా సంఘాల నేతలు కూడా ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాయదుర్గంలో విద్యార్థుల ర్యాలీ
అనంతపురం జిల్లా రాయదుర్గంలో డాక్టర్ ప్రియాంకరెడ్డిపై అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ నుంచి వినాయక సర్కిల్ వరకూ ర్యాలీ సాగింది. అనంతరం విద్యార్థులు మానవహారం చేపట్టారు. విద్యార్థుల ర్యాలీకి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారాయన.
కలచివేసింది
అత్యంత పాశవికంగా హత్యకు గురైన ప్రియాంకా రెడ్డి ఘటన తనను ఎంతగానో కలతకు గురి వేసిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ కిరాతకులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే చట్టాలను సవరించటానికి కూడా వెనుకాడ కూదని సూచించారు. ఈ ఘటనలో దోషులకు విధించిన శిక్షతో అటువంటి పైశాచికానికి పాటుపడాలంటేనే భయపడేలా శిక్షవుండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment