గంగాధరం బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు
వేంపల్లె : ఆంధ్రప్రదేశ్ రోడ్ల మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గంగాధరం బంధువుల ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో సీఐలు శంకర్, రామచంద్రలతోపాటు మరో 5మంది ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ బీచ్ నాలుగు రోడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని పిర్యాదు చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
ఏపీ, తెలంగాణా, బెంగుళూరు తదితర ప్రాంతాలలో దాదాపు 29చోట్ల ఈ దాడులు కొనసాగుతుండగా.. అందులో భాగంగా శనివారం వేంపల్లెలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాలాజి వీధిలో ఆయన బావమర్ది, రిటైర్డు అధ్యాపకుడు చంద్రమౌళి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉదయం 6గంటల నుంచే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రమౌళి ఇంట్లో ఉన్న పత్రాలతోపాటు అన్నిచోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే ఇప్పటిదాకా సోదాలు జరుగుతున్నాయి కానీ.. వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయమై సాక్షి ఏసీబీ అధికారులను వివరణ కోరగా చంద్రమౌళి ఇంట్లో ఉన్న పత్రాలు, బంగారు నగలను పరిశీలించామని.. అన్ని ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంకా కడప, పులివెందులలోని గంగాధరం బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.