లారీ కింద హైమావతి మృతదేహం
– రోడ్డు ప్రమాదంలో తల్లి దుర్మరణం
– ముచ్చింతల్ వద్ద ఆటోను ఢీకొన్న లారీ
– ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఆమె అసలే వద్ధురాలు.. ఆపై భర్త మూడేళ్ల క్రితమే గుండెపోటుతో మృతి చెందాడు.. ఇక మతిస్థిమితం సరిగాలేని తన కొడుకును ఎలాగైనా ఆస్పత్రికి తీసుకెళ్లి బాగు చేయించాలని ఆ తల్లి ఎంతో ఆరాటపడింది.. అది నెరవేరకుండానే విధి ఆడిన నాటకంలో రోడ్డు ప్రమాదానికి గురై కానరానిలోకాలకు చేరుకుంది.. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.
శంషాబాద్ రూరల్ / కొందుర్గు : మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గుకు చెందిన హైమావతి (60), శ్రీశైలం దంపతులకు కొడుకు 30ఏళ్ల వినోద్‌కుమార్‌తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భర్త మూడేళ్ల క్రితమే గుండెపోటుతో మృతతిచెందాడు. ముగ్గురు కూతుళ్లకు గతంలో పెళ్లిళ్లు అయ్యాయి. ఉన్న ఒక్క కొడుకుకు కొన్ని నెలలుగా మతిస్థిమితం సరిగాలేదు. దీంతో అప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని జిమ్స్ ఆస్పత్రిలో తల్లి చికిత్స చేయిస్తోంది. ఇందులోభాగంగా శుక్రవారం ఉదయం ఆమె తమ కొడుకు, పెద్దకూతురుతో కలిసి ఆర్టీసీ బస్సులో మదన్‌పల్లికి వచ్చింది. అక్కడి నుంచి మరో ఇద్దరు ప్రయాణికులతోపాటు ఆటోలో ఆస్పత్రికి బయలుదేరింది. మార్గమధ్యంలోని ముచ్చింతల వద్దకు చేరుకోగానే పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ నుంచి పాల్మాకుల వెళుతున్న లారీ ఢీకొనడంతో హైమావతి ఎగిరి దాని చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనలో కొత్తూరు మండలం నందిగామకు చెందిన ఆటో డ్రైవర్ నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అలాగే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ భాస్కర్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం శంషాబాద్ క్లస్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మతదేహాన్ని బంధువులకు అప్పగించారు.