ధైర్యంగా కబ్జా చేసేస్తున్నారు..
–ప్రజాప్రతినిధుల మద్దతుతోనేనా
–గజం ధర రూ 15 నుండి 20వేలు
–సుమారు అరెకరం వరకూ కబ్జా
–పట్టించుకోని అధికారులు
పాలకొల్లు సెంట్రల్ ః పట్టణంలో అనేక రిజర్వ్‌డ్ స్థలాలు, చెరువులు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. ఈ కబ్జాలు చేసేది బడాబాబులే. ఇక్కడ కబ్జాకు గురవుతున్న స్థలం విలువ ఎంతో తెలుసా సుమారు ఐదు కోట్లు. వింటే ఆశ్చర్యం కలగవచ్చు కాని అక్కడ మార్కెట్ ధర వింటే మాత్రం వాస్తవమే అనిపిస్తుంది. ఇక్కడ స్థలం గజం ధర సుమారు రూ.15 నుండి 20వేలు పలుకుతుంది. ఇక్కడ కబ్జాకు గురైన స్థలం దాదాపుగా అరెకరం పైనే ఉంటుందని పలువురు అంటున్నారు. అధికారులు వారి లెక్కల ప్రకారం కొలతలు వేస్తే చెరువు ఎంత కబ్జా అయ్యిందో బయటపడుతుందని దాదాపుగా ఐదు కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు. పట్టణంలోని 9వ వార్డులో సుమారు ఐదెకరాలు శ్మశానం చెరువు ఉంది. సాయినగర్ కాలనీకి వెనుక ఉన్న ఈ చెరువును కొందరు ప్రభుద్దులు వారి భవనాలకు అనుకూలంగా ఉన్నంత పరిదిలో పూడ్చుకుంటున్నారు. ఇప్పటికి వీరి పూడికలతో చెరువు పడమర భాగాన్ని కనుమరుగు చేసేసారు. గతంలో ఆదిత్యా కాలనీలో నిర్మించిన సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధుల మద్ధతుతో ఆలయానికి సుమారు 1500 గజాల స్థలాన్ని పూడ్చుకుని మండపం నిర్మించారు. ఇది పదిమందికి ఆధ్యాత్మికతకు ఉపయోగపడేది కాబట్టి అందరూ సహకరించారు నిర్మాణం పూర్తిచేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ గుడికి దక్షిణం వైపున ఉన్న సాయినగర్ కాలనీ వాసులు కొందరు వారి ఇష్టానుసారంగా పుడ్చుకుంటున్నారు. కాలనీకి ఉత్తరంలో చెరువు పక్కన సాయిబాబా ఆలయం అడ్డు ఉండడంతో వీళ్లు యదేచ్చగా పూడ్చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఓ ఇంటి యజమాని శనివారం పూడికపనులు ప్రారంభించారు. దర్జాగా రోడ్డుపై మట్టి వేసుకుని మనుషులతో చెరువును పూడ్పిస్తున్న ఈ యజమాని దైర్యానికి ఏ ప్రజాప్రతినిధి అండవుందో అని ఎవ్వరూ అధికారులకు పిర్యాదు చేయలేకపోతున్నారు. పేదవాడికి సెంటు స్థలం ఇవ్వడానికి కాళీ స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం బడాబాబులు కబ్జాలు చేస్తుంటే మాత్రం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.