హత్య కేసులో నిందితుడు అరెస్టు
Published Thu, Feb 16 2017 12:35 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
కర్నూలు: కురువ వెంకటరమణ(32) హత్య కేసులో నిందితుడు రవిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడు సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద ఈనెల 4వ తేదీన హత్య జరిగిన విషయం విదితమే. కర్నూలు మండలం గార్గేయపురం సమీపంలోని సయ్యద్ దర్గా దగ్గర నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. నిందితున్ని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరుపర్చగా బుధవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలను వెల్లడించారు.
అప్పు తీర్చలేక..
పగిడ్యాల మండలం ఘనపురం గ్రామానికి చెందిన చంద్రన్న, ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నాల్గవ సంతానమైన వెంకటరమణ వ్యవసాయం చేస్తూ తండ్రికి చేదోడుగా ఉండేవాడు. నందికొట్కూరు పట్టణంలోని కురువ వీధికి చెందిన వెంకటలక్ష్మమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వెంకటరమణకు వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. అదే గ్రామం కురువ వీధికి చెందిన రవితో వెంకటరమణకు స్నేహం ఏర్పడింది. దాదాపు రూ.16 లక్షలను వెంకటరమణ వద్ద రవి అప్పుగా తీసుకున్నాడు. దానిని తీర్చిలేక పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేశాడు.
నమ్మించి..
ప్రామిసరీ బాండ్లు తీసుకుని తనతో పాటు పి.రుద్రవరం గ్రామానికి వస్తే తన మామ కురువ సంజన్నతో డబ్బులు ఇప్పిస్తానని రవి నమ్మబలికాడు. ఉదయం 9 గంటలకు ఇద్దరూ ఏపీ21ఎల్ 1419 నెంబర్ గల మోటర్‌సైకిల్‌పై నందికొట్కూరు నుంచి రుద్రవరానికి బయలుదేరారు. తాండ్రపాడు గ్రామ సరిహద్దుల్లోని హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ గట్టుపై రుద్రవరం గ్రామానికి వెళ్లే దారిలో పథకం ప్రకారం మోటర్‌సైకిల్ నడుపుతున్న వెంకటరమణను కత్తితో పొడిచి గాయపరిచాడు. ఇద్దరూ మోటర్‌సైకిల్ పైనుంచి కింద పడ్డారు. తర్వాత గొంతుపై పొడచి హత్య చేసి జేబులో ఉన్న ప్రామిసరీ నోట్లను లాక్కుని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వలో చించి పడేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తాలూకా పోలీసులు పక్కా సమాచారం మేరకు అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ వెల్లడించారు. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డితో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Advertisement