రామాయపట్నం పోర్ట్ సాధనే లక్ష్యం
-
కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి
నెల్లూరు(వేదాయపాళెం) : కావలి నియోజకవర్గంలో రామయ్యపట్నం పోర్ట్ సాధించడమే తమ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంటలేవుట్‌లోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పారని, అయితే ఆచరణలో మాత్రం ముందుకు సాగడంలేదన్నారు. కావలి చెన్నాయపాళెం వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం విచారకరమన్నారు. బోగోలు వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురావాలన్నారు. త్వరలో నెల్లూరు, ఒంగోలు ఎంపీలైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో చర్చించి పోర్టు సాధనకు కమిటీ వేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
24న పాదయాత్ర
కావలి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పోర్టు సాధన కోసం సెప్టెంబర్ 24న కావలి నుంచి రామయ్యపట్నం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పోర్టు మంజూరుకాకుండా అప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్ 60 మంది ఎంపీలతో సంతకాలు చేయించి దుగ్గరాజుపట్నం పోర్టు మంజూరుకు తోడ్పడ్డారని తెలిపారు. దుగ్గరాజుపట్నం కంటే రామయ్యపట్నం పోర్టు ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి పందిటి కామరాజు, రైల్వే కమిటీ సభ్యుడు కామయ్య, కావలి ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరసు మాల్యాద్రి, కౌన్సిలర్లు సూరె మోహన్‌రెడ్డి, మందా శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.