కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Published Tue, Feb 7 2017 11:14 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
–మార్చి 18 వరకు ఎమె్మల్సీ ఎన్నికల కోడ్ అమలు
– ప్రజా ప్రతినిధులు నిర్వహించే సమీక్షలకు అధికారులు వెళ్లరాదు
-13న ఎన్నికల నోటిఫికేషన్
–విలేకరుల సమావేశంలో కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేయడంతో సోమవారం సాయంత్రం నుంచి కోడ్ అమలో్లకి వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చే సే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ హరికిరణ్, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు అనంతపురం కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని, తాను జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటానని, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు అదనపు రిటర్నింగ్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మండలానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు కమిటీలు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను, అలాగే మీడియా సెంటరును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలుపై అనుమానాలను నివృత్తికి కలెక్టరేట్‌లో ఎన్నికల సెల్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.ఎన్నికల షెడ్యూలు, విధివిధానాలు, నియమావళి తదితర వాటిని వివరించారు.
13న ఎన్నికల నోటిఫికేషన్
ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అదేరోజు నుంచి నామినేషన్‌లు మొదలవుతాయని తెలిపారు. నామినేషన్‌ల ప్రక్రియ అనంతపురంలో జరుగుతందని నామినేషన్‌ల దాఖలుకు ఈనెల 20 ఆఖరు అని కలెక్టర్ వివరించారు.
మార్చి 9న పోలింగ్
పోలింగ్ మార్చి 9వ తేదీన ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఉపాధ్యాయుల ఓటర్లు జిల్లాలో 6945 మంది, పట్టభద్రుల ఓటర్లు 84,754 మంది ఉన్నారని చెప్పారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే నామినేషన్‌ల చివరి రోజు అంటే ఈ నెల 20 వరకు క్లయిమ్‌లు దాఖలు చేసుకోవచ్చని సూచించారు. పట్టభద్రులకు 112, ఉపాధ్యాయులకు 54 ప్రకారం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలను మండల తహసీల్దారు కార్యాలయంలోనే ఏర్పాటు చేస్తున్నామని, వీటిపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వవచ్చన్నారు.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘనపై..
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అంటే సోమవారం రాత్రి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కొత్త పింఛన్‌లు పంపిణీ చేసిన విషయాన్ని ఓ విలేఖరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఆయన స్పందిస్తూ అప్పటికి కోడ్ విషయంపై స్పష్టమైన ఆదేశాలు రాలేదని, కోడ్ ఆదేశాలు పంపడంలోనూ జాప్యం జరిగిందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై విలేకర్లు పలు ప్రశ్నలు వేయగా అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇది....
– మార్చి 18 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.
–ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించే సమీక్షలకు అధికారులు వెళ్లరాదు. అధికారులతో వారు ఎలాంటి సమీక్షలు చేయరాదు. ప్రజాప్రతినిధులు కోడ్ సమయంలో ప్రభుత్వ వాహనాలు వాడరాదు. అధికారులు ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనరాదు.
– కొత్తగా ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేపట్టరాదు. కొత్తగా ఎటువంటి మంజూరులు చేపట్టరాదు. అంటే రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర అవసరాలకు నిధులు విడుదల, ఇతరత్రా ప్రయోజనం చేకూర్చడం వంటివి చేయరాదు. రొటీన్‌గా జరిగే కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి.
– ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లను రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉపయోగించుకోరాదు.ప్రభుత్వ కార్యాలయాలకు బ్యానర్లు కట్టడం, వాల్ రైటింగ్ వంటివి చేపట్టరాదు. ప్రయివేలు ఆస్తులకు వారి అనుమతి లేకుండా బ్యానర్లు కట్టడం, వాల్‌రైటింగ్ చేయరాదు. ప్రభుత్వ పండగలకు రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించరాదు.
–ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, ఇతర బ్యానర్లు తదితరవాటిని తక్షణం తొలగించాలి.
Advertisement
Advertisement