మోగిన నగారా! | nagara is play | Sakshi
Sakshi News home page

మోగిన నగారా!

Published Mon, Feb 6 2017 9:33 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

మోగిన నగారా! - Sakshi

మోగిన నగారా!

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌
– 13న నోటిఫికేషన్‌ జారీ
– మార్చి 9న పోలింగ్‌– 15న ఎన్నికల ఫలితాలు
– అధికార పార్టీని వెన్నాడుతున్న ప్రత్యేక హోదా భయం
– పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపాల్‌ రెడ్డికి సానుకూలత
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. పరోక్ష ఎన్నికలైన పట్టభద్ర, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు కేటాయించారు. ఇక ఎన్నికలు వచ్చే నెల.. అంటే మార్చి 9వ తేదీ నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అభ్యర్థుల భవితవ్యం మాత్రం మార్చి 15న తేలనుంది. ఈ ఎన్నికల్లో ఎన్నడూ మెరుగైన ఫలితాలు లేని అధికార పార్టీ ఎలాగైనా గెలిచేందుకు కుయక్తులను ప్రారంభించింది. అయినప్పటికీ గెలుపు భరోసా లేకపోవడంతో అక్రమాలకు తెరలేపేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రధానంగా పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీఎన్‌జీఓ నేతగా పనిచేసిన వెన్నెపూస గోపాల్‌ రెడ్డికి పూర్తి ఆధిక్యత కనబడుతోంది. ఎన్‌జీఓ నేతగా ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషితో పాటు.. ప్రత్యేక హోదా విషయంలో ముందుండి పోరాడుతున్న ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆయన బరిలో ఉండటం ప్రధాన సానుకూల అంశంగా కనపడుతోంది. అదేవిధంగా టీచర్స్‌ ఎమ్మెల్సీలో కూడా అధికార పార్టీ అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
మళ్లీ అబద్దపు హామీలు
ప్రత్యక్ష ఎన్నికల్లో ఏదో ఒక విధంగా అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన అధికార తెలుగుదేశం పార్టీ పరోక్ష ఎన్నికల్లోనూ ఇదే పంథాను కొనసాగించాలని నిర్ణయించినట్టు కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీ విజయవాడలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అకస్మాత్తుగా సమావేశాన్ని నిర్వహించారు. అంతేకాకుండా ఉద్యోగులకు అనుకూలంగా ఉంటామని ప్రకటించారు. గతంలో చేసిన తప్పును చేయనని ఉద్ఘాటించారు. మరోవైపు ఉద్యోగులకు రావాల్సిన డీఏ విషయంలో మాత్రం వెనుకంజ వేస్తున్నారు. ఇవ్వాల్సిన మూడు డీఏలు ఇప్పటివరకు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల నేపథ్యంలో ఒక డీఏ ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి పరోక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఈసారి నెగ్గేందుకు యత్నాలు ప్రారంభించింది.
 
ప్రత్యేక హోదా భయం...!
తమిళనాడులో జల్లికట్టు ఆట కోసం అక్కడి ప్రజలు సాగించిన పోరాటం స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా అంశంపై మరోసారి పోరాటం ఉద్ధృతమయ్యింది. ప్రధానంగా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై పోరాటం కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాలు కావడంతో.. ఈ వర్గాల్లో ప్రత్యేక హోదా రావాలనే డిమాండ్‌ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రత్యేక హోదా డిమాండ్‌ ఒక బలమైన అంశంగా ముందుకు వచ్చే అవకాశం ఉందని విషయం అధికార పార్టీని కలవరపెడుతోంది. చదువుకున్న ఈ వర్గాలు ప్రత్యేక హోదా డిమాండ్‌ను సమర్ధిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నెపూస గోపాల్‌ రెడ్డికి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేకుండా సమర్థించే అవకాశం కనిపిస్తోంది. దీంతో తమను ప్రత్యేక హోదా డిమాండ్‌ దెబ్బకొడుతుందని అధికారపార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
 
ఇవీ పోలింగ్‌ స్టేషన్లు, ఓటర్ల వివరాలు
ప్రస్తుతం టీచర్స్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ కడప (పశ్చిమ రాయలసీమ) జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలకు జిల్లాలో ఉన్న పోలింగ్‌ స్టేషన్లు, ఓటర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 
గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికలు
– పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య – 112
– ఓటర్ల సంఖ్య తుది జాబితా (12 జనవరి నాటికి) – 84,754
 
టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు
– పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య – 54
– ఓటర్ల సంఖ్య (12 జనవరి నాటికి) – 6,950
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement