గ్రేటర్‌లో మరో ఎన్నికల ప్రక్రియకు తెరలేస్తోం ది.త్వరలో గడువు ముగియనున్న మహబూబ్‌నగర్- రంగారెడ్డి-హైదరాబాద్...
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
19న నోటిఫికేషన్ మార్చి 16న పోలింగ్.
సిటీబ్యూరో: గ్రేటర్‌లో మరో ఎన్నికల ప్రక్రియకు తెర లేస్తోం ది.త్వరలో గడువు ముగియనున్న మహబూబ్‌నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూలు వెలువడింది. డాక్టర్ నాగేశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుండటంతో ఈ ఎన్నిక జరుగ నుంది. దీనికి ఈ నెల 19న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 16న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తోంది. సాధారణ నిర్వహణ పనులు మినహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజాప్రతినిధుల ప్రచార కార్యక్రమాలకు తెర పడింది.
2.86 లక్షల ఓటర్లు
మహబూబ్‌నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లు 2,86,311 మంది ఉన్నారు. వీరిలో రంగారెడ్డి జిల్లా నుంచే అత్యధికంగా 1,33,003 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి 87, 208 మంది, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 66,100 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,92,110 మంది పురుషులు కాగా, 94,188 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. గత నవంబర్ చివరి వారం వరకు 2,14,477 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా... మార్పుచేర్పుల అనంతరం తుది జాబితాలో 71,845 మంది పెరిగారు. మార్పుచేర్పుల్లో భాగంగా జాబితా నుంచి పేర్లు తొలగించినవారు 6,820 మంది ఉండగా... కొత్తగా పేర్లు నమోదైన వారు 78,665 మంది ఉన్నారు.
నాగేశ్వర్ పోటీపై డైలమా
గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ కె.నాగేశ్వర్ తిరిగి పోటీ చేస్తారా? చేయరా? అనే అంశంలో డైలమా నెలకొంది. ఈ అంశంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని నాగేశ్వర్ బుధవారం రాత్రి మీడియాకు చెప్పారు. ఆయన పోటీ విషయం తేలేందుకు మరి కొద్ది రోజులు పట్టనుంది.