సినీ నటుడి ముసుగులో ఉదయ్ కిరణ్ మోసాలు | Actor Nanduri Uday Kiran held for drug trafficking in Kakinada | Sakshi
Sakshi News home page

సినీ నటుడి ముసుగులో ఉదయ్ కిరణ్ మోసాలు

Published Thu, Jan 14 2016 1:00 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

సినీ నటుడి ముసుగులో ఉదయ్ కిరణ్ మోసాలు - Sakshi

సినీ నటుడి ముసుగులో ఉదయ్ కిరణ్ మోసాలు

కాకినాడ :  సినీనటుడు నండూరి ఉదయ్ కిరణ్ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్నాయి. అతడి చేతిలో మోసపోయిన అనేకమంది టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. కాకినాడ రాజా ట్యాంకు సమీపంలోని జీఆర్‌టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ నెల 11న అర్ధరాత్రి ఉదయ్ కిరణ్ అలజడి సృష్టించిన సంగతి విదితమే. తాను సినీ హీరోనంటూ బార్‌లో వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, సిబ్బందిపై దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అతనిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేశారు. టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ వివరాలు తెలిపారు.
 
కాకినాడ భానుగుడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమారుడి ఉద్యోగం కోసం ఉదయ్‌కిరణ్‌కు గతేడాది మే నెలలో రూ.2 లక్షలు ఇచ్చింది. అప్పటి నుంచి ఉద్యోగం కోసం అడుగుతున్నా, ఉదయ్ కిరణ్ నుంచి సరైన సమాధానం లేదు. దీంతో ఆమె బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక ఇబ్రహీం వీధికి చెందిన మరో మహిళ, ఆమె సోదరుడు కూడా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2006లోనే ఉదయ్ కిరణ్ కాకినాడకు చెందిన ఓ వ్యక్తిపై దాడి చేసి, సొమ్ము దోపిడీ చేయడంతో త్రీ టౌన్ క్రైం పోలీసులు అతడిపై సస్పెక్ట్ షీట్ తెరిచారు. దీంతో అతడు 2007లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తనకు సినీ, రాజకీయ రంగాల్లో ప్రముఖులతో పరిచయాలున్నాయంటూ పలువురిని మోసగించాడు.
 
సినీ స్టుడియోలో ఉద్యోగం ఇప్పిస్తానని..

మూడేళ్ల క్రితం స్థానిక ఇబ్రహీం వీధికి చెందిన ఈలి శారదా భవాని, ఆమె సోదరుడు షిర్డీ వెళ్తున్న సమయంలో రైలులో ఉదయ్ కిరణ్ పరిచయమయ్యాడు. శారదా భవాని ఎంకాం బీఈడీ చేసినట్టు అతనితో చెప్పింది. హైదరాబాద్‌లోని సినీ స్టూడియోలో అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని, నెలకు రూ.50 వేల జీతం వస్తుందని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె అతడికి రూ.3 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత ముఖం చాటేయడంతో అతడి కోసం గాలించింది. హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లి నిలదీసింది. చంపుతానని అతడు బెదిరించడంతో ఆమె భయపడి, వెనక్కు తగ్గింది. రెండు రోజుల క్రితం కాకినాడ వచ్చిన అతడు.. శారదా భవానికి కనిపించడంతో రోడ్డుపైనే నిలదీసింది. అతడు ఆమెపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న రూ.2 వేలు దోచుకున్నాడు. దీంతో ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేరోజు రాత్రి జీఆర్‌టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో అలజడి సృష్టించిన ఉదయ్ కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
 మీడియాపై పరువునష్టందావా వేస్తా : ఉదయ్ కిరణ్
 
 తనను అభాసుపాలు చేస్తున్న మీడియాపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానంటూ నిందితుడు ఉదయ్ కిరణ్ విరుచుకుపడ్డాడు. బుధవారం కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ చైతన్య కృష్ణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉదయ్ కిరణ్ పరుష పదజాలంతో వీరంగం సృష్టించాడు. తనకు రాజకీయ, సినీ ప్రముఖుల అండదండలున్నాయని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియాను, తప్పుడు కేసులు బనాయించిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటు ఆగ్ర హం వ్యక్తం చేశాడు.
 
 డ్రగ్స్ కేసు కూడా..
 
 అతడిని విచారణ చేయగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. అతడిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తూ, యాంటీ నార్కొటిక్ సెల్ పోలీసులకు పట్టుబడ్డాడు. నైజీరియాకు చెందిన వ్యక్తితో పాటు ఉదయ్ కిరణ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. ఆ శాఖలోని ఓ అధికారి అతడిని ఇంతకాలం కాపాడినట్టు తెలుస్తోంది. అతడిపై అందిన ఫిర్యాదుల మేరకు చీటింగ్, దాడి కేసులు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్య కృష్ణ తెలిపారు. అతడి రక్త నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపామని, డ్రగ్స్ వాడినట్టు రుజువైతే ఆ కేసు కూడా నమోదు చేస్తామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement