Nanduri uday kiran
-
నటుడు ఉదయ్ కిరణ్ హఠాన్మరణం
సాక్షి, కాకినాడ: యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్ (34) హఠాన్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్‌కిరణ్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. (చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి) పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్ నటించారు. పలు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్నారు. 2016లో జూబ్లీహిల్స్‌లోని ఓవర్ ద మూన్ పబ్‌లో గొడవ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఉదయ్ కిరణ్ పలు నేరాలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులోనూ అరెస్టై జైలు జీవితం గడిపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కాకినాడలో మహిళను మోసం చేసిన కేసులోనూ అరెస్టయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 59లోని నందగిరిహిల్స్‌లో ఇంటి యాజమానిపై దౌర్జన్యం చేయడంతో 2018లో క్రిమినల్ కేసు పెట్టారు. ఇలా పలువురిని మోసం చేయడంతో అతడిపై పలుమార్లు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉదయ్ కిరణ్‌కు 2016లో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు. -
సినీ నటుడి ముసుగులో ఉదయ్ కిరణ్ మోసాలు
కాకినాడ : సినీనటుడు నండూరి ఉదయ్ కిరణ్ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్నాయి. అతడి చేతిలో మోసపోయిన అనేకమంది టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. కాకినాడ రాజా ట్యాంకు సమీపంలోని జీఆర్టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఈ నెల 11న అర్ధరాత్రి ఉదయ్ కిరణ్ అలజడి సృష్టించిన సంగతి విదితమే. తాను సినీ హీరోనంటూ బార్లో వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, సిబ్బందిపై దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అతనిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేశారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ వివరాలు తెలిపారు. కాకినాడ భానుగుడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమారుడి ఉద్యోగం కోసం ఉదయ్‌కిరణ్‌కు గతేడాది మే నెలలో రూ.2 లక్షలు ఇచ్చింది. అప్పటి నుంచి ఉద్యోగం కోసం అడుగుతున్నా, ఉదయ్ కిరణ్ నుంచి సరైన సమాధానం లేదు. దీంతో ఆమె బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక ఇబ్రహీం వీధికి చెందిన మరో మహిళ, ఆమె సోదరుడు కూడా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2006లోనే ఉదయ్ కిరణ్ కాకినాడకు చెందిన ఓ వ్యక్తిపై దాడి చేసి, సొమ్ము దోపిడీ చేయడంతో త్రీ టౌన్ క్రైం పోలీసులు అతడిపై సస్పెక్ట్ షీట్ తెరిచారు. దీంతో అతడు 2007లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తనకు సినీ, రాజకీయ రంగాల్లో ప్రముఖులతో పరిచయాలున్నాయంటూ పలువురిని మోసగించాడు. సినీ స్టుడియోలో ఉద్యోగం ఇప్పిస్తానని.. మూడేళ్ల క్రితం స్థానిక ఇబ్రహీం వీధికి చెందిన ఈలి శారదా భవాని, ఆమె సోదరుడు షిర్డీ వెళ్తున్న సమయంలో రైలులో ఉదయ్ కిరణ్ పరిచయమయ్యాడు. శారదా భవాని ఎంకాం బీఈడీ చేసినట్టు అతనితో చెప్పింది. హైదరాబాద్‌లోని సినీ స్టూడియోలో అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని, నెలకు రూ.50 వేల జీతం వస్తుందని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె అతడికి రూ.3 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత ముఖం చాటేయడంతో అతడి కోసం గాలించింది. హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లి నిలదీసింది. చంపుతానని అతడు బెదిరించడంతో ఆమె భయపడి, వెనక్కు తగ్గింది. రెండు రోజుల క్రితం కాకినాడ వచ్చిన అతడు.. శారదా భవానికి కనిపించడంతో రోడ్డుపైనే నిలదీసింది. అతడు ఆమెపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న రూ.2 వేలు దోచుకున్నాడు. దీంతో ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేరోజు రాత్రి జీఆర్టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్లో అలజడి సృష్టించిన ఉదయ్ కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియాపై పరువునష్టందావా వేస్తా : ఉదయ్ కిరణ్ తనను అభాసుపాలు చేస్తున్న మీడియాపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానంటూ నిందితుడు ఉదయ్ కిరణ్ విరుచుకుపడ్డాడు. బుధవారం కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ చైతన్య కృష్ణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉదయ్ కిరణ్ పరుష పదజాలంతో వీరంగం సృష్టించాడు. తనకు రాజకీయ, సినీ ప్రముఖుల అండదండలున్నాయని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియాను, తప్పుడు కేసులు బనాయించిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటు ఆగ్ర హం వ్యక్తం చేశాడు. డ్రగ్స్ కేసు కూడా.. అతడిని విచారణ చేయగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. అతడిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తూ, యాంటీ నార్కొటిక్ సెల్ పోలీసులకు పట్టుబడ్డాడు. నైజీరియాకు చెందిన వ్యక్తితో పాటు ఉదయ్ కిరణ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. ఆ శాఖలోని ఓ అధికారి అతడిని ఇంతకాలం కాపాడినట్టు తెలుస్తోంది. అతడిపై అందిన ఫిర్యాదుల మేరకు చీటింగ్, దాడి కేసులు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్య కృష్ణ తెలిపారు. అతడి రక్త నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపామని, డ్రగ్స్ వాడినట్టు రుజువైతే ఆ కేసు కూడా నమోదు చేస్తామని చెప్పారు. -
తాగి బార్లో గలాటా చేసిన యువనటుడు
కాకినాడ: 'ఫ్రెండ్స్ బుక్' సినిమా హీరోల్లో ఒకరైన నండూరి ఉదయ్ కిరణ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకుముందు డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఈ యువనటుడు ఈసారి పీకలదాకా తాగి బార్లో నానా హంగామా సృష్టించాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ టూటౌన్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన ఉదయ్ కిరణ్ సోమవారం రాత్రి స్థానిక రాజా ట్యాంకు సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. చిత్తుగా తాగిన అతడు.. తాను సినీ హీరోనని, అసిస్టెంట్ డైరెక్టర్‌నని చెప్పి అర్ధరాత్రి గలాటా సృష్టించాడు. అంతటితో ఆగకుండా రెస్టారెంట్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న టూటౌన్ పోలీసులు ఉదయ్ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉందని ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ చెప్పారు. ఉద్యోగాలిప్పిస్తానని, సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి చాలామందిని మోసగించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు. -
టాలీవుడ్ హీరో అరెస్ట్
హైదరాబాద్ : అకారణంగా యువకుడిపై దాడి చేయడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించిన సినీ హీరో నండూరి ఉదయ్‌కిరణ్ అలియాస్ స్కాం బాబీ (పరారే,ఫేస్లుక్ చిత్రాల హీరో)ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కథనం ప్రకారం... ఎస్ఆర్నగర్లోని బీకే గూడలో నివాసం ఉండే జాతీయ బ్యాడ్మింటన్ క్రీఢాకారుడు ఎంవీఎస్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఈ నెల 16న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని ఎయిర్ పబ్‌కు వచ్చాడు. లిఫ్ట్ ఎక్కడానికి వేచిఉండగా లోపలినుంచి మద్యం సేవించి వచ్చిన హీరో ఉదయ్‌కిరణ్ లిఫ్ట్ దిగి బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న ప్రవీణ్‌ను చూడగానే ఉదయ్ బూతులు తిడుతూ కోపంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఇటీవల రెండుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న విషయాన్ని పోలీసులకు చెప్పావంటూ ప్రవీణ్‌పై ఉదయ్ కిరణ్ దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ... కాలితో తన్నుతూ... చంపేస్తానంటూ బెదిరించాడు. అంతేకాకుండా ప్రవీణ్ తల్లిని చెల్లిని కూడా అంతం చేస్తానంటూ హెచ్చరించాడు. ఇద్దరి మద్య గొడవ తారాస్థాయికి చేరింది. దాంతో బాధితుడి ఫిర్యాదుతో నిందితుడు ఉదయ్‌కిరణ్‌పై ఐపీసీ 506,509,323ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం ఉదయ్‌కిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.