- ∙హన్మకొండ వైపు ఈటల చూపు
- ∙అదే దారిలో కరీంనగర్ ఎంపీ వినోద్
- ∙భూపాలపల్లిలో శ్రీధర్‌బాబు కార్యక్రమాలు
‘నయా’ నజర్
Published Mon, Sep 12 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనతో పరిపాలన పరంగా భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మార్పులతోపాటే... రాజకీయంగానూ నూతన సమీకరణలు జరుగుతున్నాయి. పునర్విభజనతో ఏర్పడే కొత్త జిల్లాల్లో తమ పట్టు పెంచుకునేందుకు పలువురు ముఖ్య నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. కీలకమైన స్పీకర్, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, కేబినెట్ స్థాయి పలు పోస్టులు జిల్లా నేతలకు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన జిల్లాల పునర్విభజనలోనూ వరంగల్ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా... వరంగల్ జిల్లా నాలుగు జిల్లాలుగా మారబోతోంది. కరీంనగర్ జిల్లాలోని 10 మండలాలు ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో ఆ జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా గుర్తింపు ఉన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్నారు. ప్రొటోకాల్ విషయంలోనూ కరీంనగర్ జిల్లా బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. ఈటల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక కొత్త మండలం ఏర్పాటవుతోంది. జిల్లాల పునర్విభజనలో ఆ సెగ్మెంట్‌లోని హుజూరాబాద్, కమలాపురం, జమ్మికుంట, ఇల్లంతకుంట(కొత్తది) మండలాలు హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో మంత్రి ఈటల హన్మకొండ జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈనెల 7న జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజనలో తన నియోజకవర్గం హన్మకొండలో కలుస్తోందని, మంత్రిగా తాను ఏ జిల్లాలో బాధ్యతలు నిర్వహించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. బహిరంగంగా ఈ మాటలు చెబుతున్నా... మరో రెండు, మూడు రోజుల్లో హన్మకొండలో జరగనున్న మరో కార్యక్రమానికి కూడా ఈటల రాజేందర్ వస్తున్నారు. రాజకీయంగా కీలకమైన హన్మకొండ జిల్లాకు మంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేసేందుకే హన్మకొండలో జరిగే కార్యక్రమాలకు వస్తున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కరీంనగర్ లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్ సైతం హన్మకొండ జిల్లాపై దృష్టి పెట్టారు. కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని ఆరు మండలాలు హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. వినోద్‌కుమార్ 2004 ఎన్నికల్లో హన్మకొండ ఎంపీగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ నియోజకవర్గం రద్దయింది. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ ఎస్సీ కేటగిరికి రిజర్వు అయ్యింది. హన్మకొండ లోక్‌సభ సెగ్మెంట్‌లో కరీంనగర్ జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం ఉండేది. దీంతో వినోద్‌కుమార్ 2009 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లోనూ అక్కడే పోటీ చేసి గెలిచారు. గతంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వినోద్‌కుమార్ తాజాగా జరుగుతున్న జిల్లాల పునర్విభజనతో మళ్లీ హన్మకొండ జిల్లాపై దృష్టి పెడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న దశాబ్దంపాటు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం రాజకీయంగా కొత్తదారిలోకి వెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా మంథని శ్రీధర్‌బాబు సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు, మహదేవపూర్ మండలాలు కొత్తగా ఏర్పడుతున్న భూపాలపల్లి(జయశంకర్) జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో శ్రీధర్‌రాబు సైతం భూపాలపల్లి రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం టేకుమట్ల కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన పునర్విభజన ముసాయిదాలో టేకుమట్ల మండలం ప్రస్తావన లేదు. దీంతో టేకుమట్ల కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యర్యంలో గత బుధవారం టేకుమట్లలో జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తు రాజకీయ వ్యూహాలతోనే శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement