నిబంధనలు బేఖాతర్
- వేసవి సెలవులకు ముందే అడ్మిషన్లు
- బరి తెగించిన కార్పొరేట్ విద్యాసంస్థలు
- అధ్యాపకులు, పీఆర్‌ఓలకు టార్గెట్లు
- ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయిన అడ్మిషన్లు
- పట్టించుకోని అధికారులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం మే చివరి వారంలో నోటిఫికేషన్ ఇవ్వగా...జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంది. పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తూచ తప్పకుండా పాటిస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. వేసవి సెలవులు రాకముందే అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో 70 శాతానికి పైగా అడ్మిషన్లు పూర్తయ్యాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అధ్యాపకులకు టార్గెట్లు
నారాయణ, చైతన్య, ఎన్‌ఆర్‌ఐ కళాశాల యాజమాన్యాలు తమ వద్ద పని చేస్తున్న అధ్యాపకులకు అడ్మిషన్ల విషయంలో టార్గెట్లు విధిస్తున్నారు. వీరిలో నెలకు రూ. 6–8 వేలు వేతనం తీసుకునే జూనియర్ అధ్యాపకులు మొదలుకుని నెలకు రూ. 50–70 వేలు తీసుకునే సీనియర్ అధ్యాపకుల వరకు ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదు. విధిగా అడ్మిషన్లు చేయాల్సిందే. ఒక్కొక్కరూ ప్రతినెలా 2–3 ప్రకారం అడ్మిషన్లు చేయాలి. లేదంటే జీతాలు పెండింగ్, లేదంటే సెలవులు మంజూరులో కోత పెడుతున్నారు. పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. దీనికితోడు ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్‌ఓలను నియమించుకున్నారు. వారికి జీతంతో పాటు ప్రతి అడ్మిషన్‌కు ఇంత మొత్తం కమీషన్ చెల్లిస్తున్నారు.
ముందే అడ్మిషన్లయితే ప్రత్యేక ఆఫర్లు
జూనియర్ కళాశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థులను పాఠశాలల వారీగా జాబితాలు సేకరించి పీఆర్‌ఓలు, అధ్యాపకులకు ఇస్తున్నారు. జాబితాలోని చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నంబర్ల ఆధారంగా వెళ్లి వారిని కలుస్తున్నారు. కనీసం ఫలితాలు కూడా రాకనే ఎలా నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే...వారికి లేనిపోని ఆశలు పెడుతూ ఒప్పిస్తున్నారు. దీనికితోడు ‘మీరు ఇప్పుడే కమిట్ అయితే ఫీజులో కూడా రాయితీ ఇస్తామని’ చెబుతుండడంతో చాలామంది తల్లిదండ్రులు ఒప్పేసుకుంటున్నారు. వాస్తవ ఫీజు నుంచి 10–30 శాతం డిస్కౌంటు ఉంటుందని చెబుతున్నారు. సీటు రిజర్వేషన్‌లో భాగంగా డేస్కాలర్ విద్యార్థులకైతే రూ. 2300, హాçస్టల్ విద్యార్థులకైతే రూ. 5–10 వేలు వసూలు చేస్తున్నారు. పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత కళాశాలల్లో చేరే సమయంలో మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఆందోళనలు చేసినా ఫలితం నిల్
అక్రమ అడ్మిషన్లపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేదు. కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని శాసించేస్థాయిలో ఉండడంతో అధికారులు గట్టిగా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. అక్రమ అడ్మిషన్లపై ఇంటర్ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు.