ఆశయం సరే.. ఆటలూ? | no sports in private educational instituions | Sakshi
Sakshi News home page

ఆశయం సరే.. ఆటలూ?

Published Tue, Sep 27 2016 11:12 PM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

ఆశయం సరే.. ఆటలూ? - Sakshi

ఆశయం సరే.. ఆటలూ?

ఏటా నామమాత్రంగా కళాశాల విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు
అఫ్లియేషన్‌ ఫీజుతో సరిపెడుతున్న ప్రైవేట్‌ యాజమాన్యాలు
పోటీల్లో కనిపించని ప్రైవేట్‌ విద్యార్థులు


క్రీడలతో మానసిక వికాసం ఉంటుందని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చే అధికారులు, పాలకులు ఆ దిశగా సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యారంగంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పుస్తకాలతో విద్యార్థులు కుస్తీ పడుతున్నారు. చదువు తప్ప మరో వ్యాపకం లేకుండా పోవడంతో చాలా మంది విద్యార్థులు మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. శారీరక దఢత్వం లేకుండా పోతోంది. ఇది గుర్తించిన ప్రభుత్వం విద్యార్థి దశలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అయితే ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కావడం గమనార్హం.


41 కళాశాలలకు ఏడుగురు పీడీలు
జిల్లా వ్యాప్తంగా 41 ప్రభుత్వ జూనియర్, వత్తివిద్య కళాశాలలు ఉన్నాయి.  వీటిలో 27 మాత్రమే పీడీ  (ఫిజికల్‌ డైరెక్టర్‌) పోస్టులుండగా అందులో  కేవలం ఏడుగురు మాత్రమే విధుల్లో ఉన్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అనంతపురం కొత్తూరు జూనియర్‌ కళాశాల,  పాతూరు కళాశాల, కేఎస్‌ఆర్‌ బాలికల కళాశాల, కదిరి బాలికల  కళాశాల, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, గుంతకల్లు కళాశాలల్లో మాత్రమే పీడీలు ఉన్నారు. అనంతపురంలోని పాతూరు జూనియర్‌ కళాశాల, హిందూపురం బాలికల కళాశాలకు తప్ప ప్రతి కళాశాలకు మైదానం ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఈ మైదానాల్లో ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, త్రోబాల్, ఖోఖో, బాల్‌బ్మాడ్మింటన్‌ కోర్టులు ఏర్పాటు చేయలేదు. రన్నింగ్‌ కోసం ట్రాక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా కనిపించవు. ఆఖరుకు అత్యంత క్రేజీ క్రీడగా పేరుగాంచిన క్రికెట్‌ ఆడేందుకు సరైన పిచ్‌లు కూడా లేకపోవడం శోచనీయం. ఇవి ప్రభుత్వ కళాశాలల్లో పడకేసిన క్రీడాభివద్ధికి అద్దం పడుతున్నాయి.

ప్రైవేట్‌ కళాశాలల్లో పరిస్థితి భిన్నం
ప్రైవేట్‌ కళాశాలల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 112 ప్రైవేట్‌ కళాశాలలుండగా,  15 కళాశాలలకు మాత్రమే మైదానాలున్నాయి.  పీడీలు ఉన్నా... విద్యార్థులకు ఎలాంటి ఆటలు ఉండవు. బహుళ అంతస్తుల భవనాల్లో తరగతి గదులు నిర్వహిస్తున్నారు తప్ప పిల్లలకు వ్యాయామ విద్య కరువైంది. బాధాకరమేమిటంటే మైదానాలున్న కళాశాలల్లో సైతం క్రీడలు ఆడించడం లేదు. అయితే క్రీడలకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజులు మాత్రం వసూలు చేస్తుంటారు.

అఫ్లియేషన్‌ ఫీజులతో సరి
ఏటా కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నారు.  ఇందులో అన్ని ప్రైవేట్‌ యాజమాన్యాల కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత జిల్లాస్థాయిలో డీవీఈఓ, ఆర్‌ఐఓలది. అయితే జిల్లాలో ఇప్పటిదాకా ఒక్క ప్రైవేట్‌ కళాశాల నుంచి కూడా విద్యార్థులు స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొన్న దాఖలాలు లేవు. క్రీడల నిర్వహణకు అఫ్లియేషన్‌ ఫీజు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు కూడా ఫీజు వస్తే చాలు విద్యార్థులు  రాకపోయినా పర్వాలేదు అనే ధోరణిలో  వెళ్తున్నారు. దీంతో ప్రతిసారి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులే క్రీడా పోటీలకు హాజరవుతున్నారు. అదికూడా వేళ్లమీద కళాశాలల పేర్లు లెక్కించొచ్చు. స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొనని కళాశాలలపై చర్యలు తీసుకోవాలనే నిబంధన ఉన్నా... అధికారులు సాహసించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.

ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాల్సిందే...
స్పోర్ట్స్‌మీట్‌లో ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాల్సిందే. ఈసారి ఎవర్నీ ఉపేక్షించం. ఇదే విషయాన్ని ఆర్‌ఐఓకు కూడా స్పష్టం చేశాం. చాలా ప్రభుత్వ కళాశాలల్లో  పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే పిల్లలకు ఇబ్బంది కలగకుండా చురుకుగా ఉన్న అధ్యాపకులతో ఆటలు ఆడిస్తున్నారు.  
– వెంకటరమణ, ఆర్జేడీ

================================================

ఆటలు తప్పనిసరి
మానసిక ప్రశాంతత కోసం ప్రతి విద్యార్థికీ ఆటలు తప్పనిసరి. ప్రస్తుత పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులకు ఆటలు ఆడే అవకాశం లేకుండా పోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువులు, ర్యాంకులపైనే దష్టి నిలుపుతున్నారు. ఆటలు లేకపోవడం వల్ల వారిలో మానసిక పరిపక్వత లోపిస్తోంది. దీని ద్వారా సమాజంలో సర్దుకుపోయే మనస్తత్వం ఉండదు. చెడు మార్గాలను అన్వేషిస్తారు. చిన్నపాటి సమస్యలు సైతం ఆందోళనకు గురి చేస్తాయి. ఇలాంటి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి జీవితంపైనే పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.
–  డాక్టర్‌ విజయ్‌కుమార్, మానసిక వైద్య నిపుణులు, అనంతపురం

====================================================

స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం
ప్రతి విద్యార్థి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలనే కలలు కంటాడు. అయితే చదువుతో పాటు క్రీడలూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు చాలా సులువుగా సాధించుకోవచ్చు. 2004, 2006లో రెండు సార్లు కబడ్డీలో ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించాను.  రెండు బంగారు పతకాలు సాధించాను. స్పోర్ట్స్‌ కోటాలోనే పోలీస్‌ శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సాధించాను. విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడంతో దేహ దారుఢ్యంతో పాటు మానసిక ఒత్తిళ్లను అధిగమించొచ్చు. గెలుపోటములను సమానంగా జీర్ణించుకునే స్వభావం అలవాటవుతుంది.
– విశ్వనాథ్‌చౌదరి, ఎస్‌ఐ, బుక్కరాయసముద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement