ఆందోళనకారులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి
మౌలిక వసతులు కల్పించాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణ శివారు ప్రాంతమైన అమ్మచెరువు మిట్ట వద్ద ఉన్న ఇందిరమ్మ కాలనీ వాసులు గురువారం మదనపల్లె– కదిరి జాతీయ రహదారిపై ఆందోళన చేశారు.
– ఇందిరమ్మ కాలనీ వాసుల ఆందోళన
– 10 కిలోమీటర్లు నిలిచిపోయిన వాహనాలు
– ఆందోళనకారులకు ఎమ్మెల్యే మద్దతు
మదనపల్లె:
మౌలిక వసతులు కల్పించాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణ శివారు ప్రాంతమైన అమ్మచెరువు మిట్ట వద్ద ఉన్న ఇందిరమ్మ కాలనీ వాసులు గురువారం మదనపల్లె– కదిరి జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ఉదయం మూడు గంటల సేపు రోడ్డును దిగ్బంధించడంతో ఇరువైపులా సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇందిరమ్మ కాలనీలో సుమారు 4 వేలకు పైగా కుటుంబాలున్నాయి. పదేళ్లుగా అధికారులు వివక్ష చూపుతూ మౌలిక సదుపాయాలు కల్పించడంలేదు. దీంతో కాలనీ వాసులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. సమస్యల పరిష్కారం కోసం మదనపలె ్లసబ్‌కలెక్టరేట్ ముందు 12 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కాలనీ వాసులు వందల సమఖ్యలో కదిరి–మదనపల్లె జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు రోడ్డుపై బైఠాయించారు. తమ కాలనీని మున్సిపాలిటీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపి ఎర్రటి ఎండలో ఆందోళనకారులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరినా ఫలితం లేదు. ఎట్టకేలకు అధికారులు నేరుగా వచ్చి సబ్‌కలెక్టర్‌తో చర్చించి లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.