
దూడల సంరక్షణపై శ్రద్ధపెట్టాలి
పశుసంపద అభివృద్ధి కోసం పుట్టిన దూడలను సంరక్షించుకోవాలని పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : పశుసంపద అభివృద్ధి కోసం పుట్టిన దూడలను సంరక్షించుకోవాలని పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు. గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆవు, పుట్టే దూడకు అవసరమైన పోషకాలు ఇవ్వడం, సంరక్షణకు మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
గర్భస్థ దశలో పౌష్టికాహారం : చూడి దశలో ఉన్న ఆవులకు పౌష్టికాహారం అందజేయాలి. ప్రతిరోజు ఖనిజ లవణ మిశ్రమం, దాణా తప్పని సరిగా ఇవ్వాలి. చివరి మూడు నెలలో గర్భంలో దూడ పెరుగుల ఎక్కువగా ఉంటుంది. పుట్టే దూడ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయంలో మరింత అదనంగా అధికంగా పోషక పదార్థాలు ఇవ్వాలి.
దూడ పుట్టిన తర్వాత : దూడ ముందుకాళ్లకు బదులు వెనుక కాళ్ల ద్వారా పుట్టినట్లయితే దూడ గర్భంలో ద్రవాలను తాగే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. దూడ పుట్టిన వెంటనే శ్వాస సరిగా ఉందో లేదో గమనించాలి. దూడ పుట్టిన వెంటనే తలక్రిందులుగా చేసినట్లయితే శ్వాసనాళాలు, పొట్టలోకి చేరిన ద్రవాలు ముక్కు ద్వారా బయటకు వస్తాయి. శ్వాస కష్టమైనప్పుడు నోటి ద్వారా ముక్కు రంధ్రాలలో గట్టిగా ఊదడం, ఛాతిని మర్ధన చేయడం, అడ్రినలన్, కొరమిన్, నికోతమైడ్, కార్టిజోన్ వంటి మందుల వాడటం, స్పిరిటస్ ఆమ్మోనియం, ఆరోమెటికస్ వాసన చూపించడం తదితర వివిధ రకాల పద్ధతులను ఆచరించి, కృతిమ శ్వాస కల్పించాలి. ఈనిన వెంటనే దూడపై ఉన్న జిగటను తల్లి నాకుతుంది. అలా చేయడం వలన శరీరం ఉష్ణోగ్రత తగ్గి, రక్త ప్రసరన, శ్వాస క్రియ ఉత్తేజపడుతుంది. తల్లి దూడను నాకడం వలన అనుబంధం పెరుగుతుంది. తద్వారా దూడ తల్లి దగ్గరకు రావడానికి అలవాటు పడుతుంది. తల్లి దూడను నాకని సందర్భంలో దూడ శరీరంపై తపుడు లేదా ఉప్పు చల్లి దూడను నాకేలా చేయాలి.
దూడ జన్మించిన వెంటనే బొడ్డు క్రింద 2 అంగుళాలు వదిలి కత్తిరించి వేలాడే మిగతా భాగంలో టంక్చర్ అయోడిన్ లేదా డెట్టాల్ అద్దాలి. ఇలా చేయడం వలనల బొడ్డువాపు జ్వరం మొదలగు వ్యాధులు రాకుండా ఉంటాయి. పుట్టిన అరగంట నుంచి రెండు గంటల్లో జున్నుపాలు తాగనివ్వాలి. జున్నుపాలలో వ్యాధి నిరోధక శక్తినిచ్చే ఆంటిబాడీలు, పోషకాలు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. బలహీనంగా, రక్తహీనతో పుట్టిన దూడలకు విటమిన్ ఏ, డీ, ఈ, ఐరన్ ఇంజక్షన్ ద్వారా ఇవ్వాలి. లేకపోతే నోటి ద్వారా కూడా ఇవ్వవచ్చు. దూడ పుట్టిన 10 రోజుల లోపు కొన్ని మందులు వాడాలి. మొదటి రోజు ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజక్షన్, రెండో రోజు విటిమిన్–ఏ, టెట్రాసైక్లిన్ వంటి ఆంటిబయాటిక్ బిళ్లల్ని లేదా ఫౌడర్‌ను తాగించాలి. 7–10 రోజుల్లో పలిక్ పాముల నిర్మూలనకు, పైపరిజిన్ అడిపేట్ ఆల్బెడజోల్, ఫెన్‌బెండజోల్ వంటి మందుల్ని పశువైద్యుని సూచన మేరకు వాడాలి.