
పాడి ఎంపికతోనే క్షీరధారలు
అనంతపురం అగ్రికల్చర్: పాడి గేదె ఎంపికపైనే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుందని పశుసంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ డీడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. దీంతోపాటు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దాణ తగినంత అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నపుడే పాడి ద్వారా మంచి ఆదాయం పొందవచ్చన్నారు.
పశువుల ఎంపిక ఇలా
అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతి జర్సీ, సంకర జాతి హెచ్‌ఎఫ్, గ్రేడెడ్ ముర్రా జాతులు గురించి తెలుసుకోవాలి. ఒకటి లేదా రెండు ఈతలు కలిగిన పశువులను ఎంపిక చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం, మరుసటి రోజు ఉదయం ఇలా మూడు పూటలు పాలు పితికి సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటే మేలు. చర్మం మృదువుగా, మెడ పొట్టిగా, పైనుంచి చూస్తే త్రికోణాకారం ఉన్న పశువు బాగుంటుంది. డొక్కలు నిండుగా, వెనుక కాళ్ల మధ్య పొదుగు బాగా విస్తరించి, నాలుగు చనులు సమాన దూరంలో అమరిఉన్నట్లు ఉండాలి. పొదుగుకు ఇరువైపులా పాలసిరలు (నరాలు) పెద్దవిగా ఉబ్బి, వంకర్లు తిరిగి ఉడాలి.
పశుగ్రాసంపై దృష్టి
పాడి, పశుపోషణలో ఎక్కువగా మేతకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పశువులు కొనేముందు రెండు నెలలకు సరిపడా గడ్డి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరగా కోతకు వచ్చే స్పీడ్ సూడాన్ గ్రాస్, అధిక దిగుబడినిచ్చే బహు వార్షికాలైన ఏపీబీఎన్ లేదా కో–3 లాంటి రకాల గడ్డిని పెంచితే ఐదారు పశువులను పోషించుకోవచ్చు. చౌడు, నీరు నిలిచే భూముల్లో పారాగడ్డి, పొలం గట్లపైన సుబాబుల్, కాలువగట్టపై అవిశ చెట్లు, పండ్ల తోటల మధ్య స్టైలో హమటా లాంటి గడ్డి రకాలను పెంచుకోవచ్చు. ఎటువంటి భూమి లేని రైతులు ‘అజొల్లా’, హైడ్రోఫోనిక్ విధానంలో పచ్చిగడ్డిని పెంచుకోవచ్చు. చాఫ్ కట్టర్ (గడ్డిని కత్తిరించే యంత్రం) ఉంటే మేత వృథా కాదు. అధిక పాల దిగుబడికి పచ్చిమేత, ఎండుగడ్డి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సమీకృత దాణ, ఖనిజ లవణ మిశ్రమం, దాణను జొన్న, సజ్జ, మొక్క జొన్న, చింతగింజల పొడి, వరి తౌడు, వేరు శనగ (చెక్క) పిండి ద్వారా తయారు చేసుకోవచ్చు.