వర్మి కంపోస్టుతో ప్రయోజనాలెన్నో!
– అన్ని రకాల పంటలకు ఉపయోగకరం
– వ్యవవసాయశాఖ ఏడీ రామేశ్వరరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : వానపాములతో తయారైన వర్మీ ఎరువులో 16 రకాల పోషకాలు ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన పంటల్లో విస్తృతంగా వాడుకోవచ్చని వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ సహాయ సంచాలకులు పి.రామేశ్వరరెడ్డి తెలిపారు.
వర్మీ అంటే: కుళ్లిన కూరగాయలు, పండ్లు, చెత్తాచెదారం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుని విసర్జించే పదార్థాన్ని వర్మీ ఎరువు లేదా వర్మి కంపోస్టుగా పిలుస్తారు. నేల పైపొరల్లో సంచరించే వానపాములు కంపోస్టును తయారీ చేస్తాయి. దీన్నే వర్మీ కల్చర్‌గా పిలుస్తారు.
విరివిగా పోషకాలు: నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటి స్థూల (మ్యాక్రో), జింక్, బోరాన్, మెగ్నీషియం లాంటి సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్)తో సేంద్రియ కర్బనం లాంటివి ఉన్నందున వర్మీ వాడకం వల్ల పంటల్లోమంచి దిగుబడులు వస్తాయి. అధిక దిగుబడుల ఆశతో ఇటీవల కాలంలో విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం తగ్గడం, చీడపీడలు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. ఫలితంగా పంట దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పశువుల ఎరువు, వర్మీ లాంటి సేంద్రియ పోషకాలపై రైతులు దృష్టి పెట్టాలి. లేదంటే భవిష్యత్తులో వ్యవసాయం మరింత నష్టాలు తెచ్చిపెడుతుంది. భూసార పరీక్షల ఆధారం చేసుకుని రసాయనాలు, సేంద్రియ పదార్థాలు కలిపిన సమగ్ర సమతుల్య ఎరువుల యాజమాన్యంతోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.
వర్మీ తయారీలో వానపాముల రకాలు: బొరోయింగ్ రకానికి చెందిన వానపాములు భూమి లోపలిపొరల్లో వుండి 80% మట్టిని, 20% ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి మొక్కలకు పోషకాల తయారీ, రవాణాలోనే కాక పైర్లకు అనుకూలమైన వాతావరణాన్ని కలుగజేస్తాయి.. నాన్–బొరోయింగ్ రకానికి చెందిన వానపాములు భూమి పైపొరల్లో వుంటూ∙20% మట్టిని, 80% ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి వ్యర్థపదార్థాలను త్వరగా కంపోస్టుగా మారుస్తాయి. ఇవి నేల యొక్క రసాయనిక, జీవ స్వభావాన్ని మార్చి భూసారాన్ని పెంచుతాయి.
తయారు చేసే విధానం: ఎండ, వాన నుంచి వానపాముల రక్షణ కోసం షెడ్డు ఏర్పాటు చేయాలి. భూమిపై ఒక అడుగు ఎత్తు, ఒక గజం వెడుల్పులో బెడ్లు తయారు చేసుకోవాలి. అడుగుభాగాన ఒక అంగుళం మందాన ఇటుక పెళ్లలు వేయాలి. ఆపైన మరో అంగుళం మట్టి వేయాలి. చీమలు, పురుగులు, చెదలు నివారణకు వేపాకులు గాని కానుగాకులు గానీ చల్లాలి. ఆపైన మూడు అంగుళాల మందాన కుళ్లిన వ్యవసాయ వ్యర్థ పదార్థాలు లేదా పశువుల పేడ, పచ్చి ఆకులు, ఎండిన ఆకులు, గడ్డి, కూరగాయలు, పండ్ల తొక్కలు, కొబ్బరి పీచు వంటివి వేయాలి. తర్వాత చదరపు మీటరకు 1000 వానపాములను వేయాలి. వానపాములు ఈ పదార్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తాయి. వర్మీ ఎరువు వాడటం వల్ల భూమి గుళ్లబారి, నీటి నిల్వ శక్తి, మొక్కలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అన్ని రకాల పంటలకు వేయడం వల్ల మంచి దిగుబడులు వస్తాయి.