నులిపురుగులతో కూర'గాయాలే' | agriculture story | Sakshi
Sakshi News home page

నులిపురుగులతో కూర'గాయాలే'

Published Tue, Sep 19 2017 9:50 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నులిపురుగులతో కూర'గాయాలే' - Sakshi

నులిపురుగులతో కూర'గాయాలే'

అనంతపురం అగ్రికల్చర్‌: నులిపురుగులు (నెమటోడ్స్‌) కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనీ, అందువల్ల వాటి నివారణకు రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ తెలిపారు. పశువులు, గొర్రెల ఎరువు, వర్మీ లాంటి సేంద్రియ పోషకాలు వాడకపోవడం, వరుసగా ఒకే పంట వేయడంవల్ల నులిపురుగుల సమస్య ఏర్పడుతుందని తెలిపారు. పంట మార్పిడి పాటించకపోవడంతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం కూడా మరో కారణమని తెలిపారు.

నులిపురుగులతో నష్టాలు
నేలలో ఉండే నులిపురుగులు పారదర్శకమైన శరీరంతో సన్నని దారంలా....పొడవుగా కంటికి కనిపించనంత స్థాయిలో ఉంటాయి. ఇవి చెట్ల వేర్లపై ఆధారపడి జీవిస్తాయి. తల్లిపురుగులు వేర్ల నుంచి వచ్చి ఒక్కొక్కటి 200 నుంచి 300 గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చే సన్నని పురుగులు వేర్లలోకి రంధ్రాలు చేసుకుని లోపలి కణజాలాన్ని తింటూ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వేర్లలోకి ప్రవేశించి అందులో ఉన్న ఆహారం పీల్చడం వల్ల వేరులోని కణజాలంలో మార్పులు జరిగి కురుపులు లేదా బుడిపెలు ఏర్పడతాయి. పురుగులు ఆశించడం వల్ల నీరు, ఇతర పోషకపదార్థాలు మొక్కలు గ్రహించకుండా అంతరాయం ఏర్పడుతుంది. మొక్కలు పెరగకుండా గిడుసబారిపోతాయి.

నులిపురుగులు ఏర్పరిచిన రంధ్రాల ద్వారా ఫ్యూజిరీయం, పీథియం, రైజాక్టోనియం, ఫైట్‌ఫైరా లాంటి శిలీంద్రాలు, సూడోమోనాస్‌ లాంటి బ్యాక్టీరియా క్రిములు వేర్లలోకి చేరి వేరు వ్యవస్థను కుళ్లిపోయేలా చేస్తాయి. దీంతో మొక్కలు త్వరగా ఎండిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. తేలికపాటి నేలల్లో టమాట సాగు చేసినపుడు నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. మొక్కలు గిడసబారి ఆకులు చిన్నవిగా ఏర్పడి పసుపురంగులోకి మారిపోతాయి. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. పూత, పిందె నిలబడకుండా దిగుబడులు తగ్గిపోతాయి. పెరికి చూస్తే వేర్లపై బుడిపెలు చాలా పెద్దవిగా ఏర్పడి ఉంటాయి. నారు పెంచినపుడు విత్తనాలు సరిగా మొలకెత్తవు. నారుకుళ్లు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి లక్షణాలే వంగ, బెండ, మిరప పంటల్లోనూ  కనిపిస్తాయి.

నివారణ పద్ధతులు
వేసవిలో రెండు నుంచి నాలుగు సార్లు లోతుగా దున్ని ఎండబెట్టడం వల్ల పొలంలోని నులిపురుగులు నశిస్తాయి. ఎకరాకు 200 కిలోల వేపపిండి లేదా నువ్వుల పిండి లేదా ఆముదం పిండి లేదా కానుగపిండి  వేయాలి.  కూరగాయల పంటలపై నులిపురుగుల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే కణపులు ఏర్పడిన మొక్కలు పెరికి కాల్చివేయాలి. నువ్వులు, బంతిపూలు, ఆవాల పంటలతో పంట మార్పిడి చేయాలి. లేదంటే బంతిపూలు, ఆవాలు, నువ్వుల పంటలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తే నష్టం తీవ్రత తగ్గుతుంది. నారు పోయక మునుపు  నారుమడులను పాలిథీన్‌ పేపరులో నాలుగు నుంచి ఐదు వారాల పాటు కప్పి ఉంచితే నేల ఉష్ణోగ్రత పెరిగి పురుగులు నశిస్తాయి. పశువుల ఎరువు, వర్మీ లాంటి సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు  వేయడంతో పాటు పంట మార్పిడి పద్ధతి పాటిస్తే నులిపురుగులను నివారించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement