అగ్రిగోల్డ్‌కు అమ్ముడుపోయిన సీఐడీ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్:
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేసి ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధిత ఐక్య సాధన సమితి జిల్లా అధ్యక్షుడు బి.చంద్రశేఖర్ కోరారు. కేసు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన సీఐడీ యాజమాన్యానికి అమ్ముడుపోయిందని ఆయన ఆరోపించారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడప నగర శివార్లలోని ఇర్కాన్ సర్కిల్‌లో నిర్వహించిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ కేసును సీఐడీకి అప్పగిస్తే ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో, ఆస్తులు జప్తు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ కేసును సీఐడీకి అప్పగించి దాదాపు రెండేళ్లవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులు బినామీ పేర్లతో ఉన్నాయని, వాటిని ప్రభుత్వం స్వా«ధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అగ్రిగోల్ద్ బాధితులు ఎంతమంది ఉన్నారో వారి పేర్ల జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి జప్తు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని బినామీ పేర్లతో మార్చుకుని బాధితులను నిలువునా మోసం చేసిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న రాస్తారోకోకు సీపీఐ, సీపీఎం, విద్యార్థి సంఘాలు, మద్దతు తెలిపాయి. రాస్తారోకో చేస్తున్న ఏజెంట్లను, బాధితులను, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసి తీసుకెళుతున్న సమయంలో పోలీసు జీపులకు అడ్డంగా కూర్చొవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఫోటో నెం: 08 కెడిపి 604, 606,607– రాస్తారోకో చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు