పైసాచకుడు
► ఆ ఎమ్మెల్యే పీఏ వసూల్ రాజా!
► పోస్టింగ్‌లు.. బదిలీలు అన్నింటికీ మామూళ్లు
► ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఎర
► ఇప్పటికే రూ.10కోట్ల వసూలు
► వాటా కోసం కాంట్రాక్టర్లకు బెదిరింపులు
► విజిలెన్స్‌కు ఫిర్యాదుల పరంపర
అధికార పార్టీ నాయకులే కాదు.. వీరి చాటు ఉద్యోగుల అవినీతి కూడా పరాకాష్టకు చేరింది. నేతల పేరు చెప్పి కొందరు.. ‘వ్యక్తిగత’ ప్రాభవంతో ఇంకొందరు.. దోపిడీకి తెర తీశారు. ఈ కోవలో ఓ ఎమ్మెల్యే పీఏ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రమేయం ఎంత మేరకు ఉందో కానీ.. ఈ సహాయకుడు మాత్రం అందరినీ పీల్చి పిప్పి చేస్తున్నాడు. వసూళ్ల పర్వం వేలు.. లక్షలు దాటి.. కోట్లకు చేరుకుందంటే ఈ ‘పైసా’చకుడు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో అర్థమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు(పర్సనల్ అసిస్టెంట్)పై ఫిర్యాదుల పరంపర మొదలయింది. సదరు పీఏపై విచారణ చేయాలంటూ విజిలెన్స్ విభాగానికి భారీగా ఫిర్యాదులు వచ్చి చేరుతున్నాయి. ఉద్యోగుల పోస్టింగ్ మొదలు బదిలీల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారనేది వాటిలోని సారాంశం. అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో నిరుద్యోగల నుంచి దోచుకుంటున్నట్లు విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు తెలిపారని సమాచారం. ఇక ప్రతి పనిలోనూ వాటాలను అడుగుతున్నారని.. ఇవ్వకపోతే పనులు జరగనివ్వడం లేదని కూడా వాపోయారని తెలిసింది.
అయితే, ఇది కేవలం పీఏ పనేనా.. సదరు ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో విచారణ జరపాలని కూడా బాధితులు విజిలెన్స్ అధికారులను కోరినట్టు చర్చ జరుగుతోంది. మొత్తం మీద అధికార పార్టీ నేతలే కాకుండా వారి సహాయ సిబ్బంది అవినీతి కూడా రోజురోజుకీ పెరిగిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొదటి నుంచీ అదే తీరు
వాస్తవానికి సదరు ఎమ్మెల్యే పీఏ వ్యవహారశైలి మొదటి నుంచీ విమర్శల పాలవుతోంది. అంతా తానే.. అనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలోని పలువురు కాంట్రాక్టర్లను పీఏ నేరుగా బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేరుగా ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సొంత పార్టీలోని నేతల ఫిర్యాదులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు ఎమ్మెల్యేకు.. ఇప్పుడు పీఏ వ్యవహారం మరింత తలనొప్పిగా మారనుంది.
ఇదిగో ఉద్యోగాల జాబితా
తాజాగా సదరు పీఏ మునిసిపాలిటీలో ఉద్యోగాల పేరుతో ఏకంగా రూ.10 కోట్ల మేరకు వసూలు చేశారని సమాచారం. ఈ విషయం కూడా విజిలెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులో ఉందని తెలిసింది. మునిసిపాలిటీలో వివిధ రకాల 40 పోస్టులను(డీఈ,ఏఈ, స్వీపరు, వాచ్‌మెన్, క్లర్క్ వగైరా) భర్తీ చేస్తున్నామని.. ఈ పోస్టులు కావాల్సిన వారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించాలని బహిరంగ బేరం పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి ఏఈ, డీఈ పోస్టులను నేరుగా భర్తీ చేసే అవకాశం లేదు. వీటిని ఏపీపీఎస్సీ భర్తీ చేస్తోంది. అయితే, ఈ పోస్టులను కూడా అవుట్‌సోర్సింగ్‌లో తీసుకుంటున్నామని నమ్మించినట్టు తెలుస్తోంది. ఇలా ప్రధానంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేశారని సమాచారం. ఇక స్వీపర్, వాచ్‌మెన్ పోస్టులకు కూడా లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. మొత్తం మీద ఉద్యోగాల పేరిట రూ.10 కోట్ల వరకూ వసూలు చేశారని విజిలెన్స్‌కు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీఏపై త్వరలో విజిలెన్స్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే, విచారణ జరగకుండా పైరవీలు కూడా మరోవైపు ప్రారంభమైనట్టు వినికిడి.