ఎంతైనా ‘డిక్టేటర్’ కదా.. ! | Sakshi
Sakshi News home page

ఎంతైనా ‘డిక్టేటర్’ కదా.. !

Published Wed, Jan 13 2016 10:59 AM

ఎంతైనా  ‘డిక్టేటర్’ కదా.. ! - Sakshi

  • జిల్లాలో దాదాపు అన్ని థియేటర్లూ బాలయ్యకే
  • తొలిరోజు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్‌కు పండగ
  • సాక్షి, విశాఖపట్నం: బాబాయ్.. అబ్బాయ్ వివాదంలో చివరికి డిక్టేటర్‌దే పైచేయి అయ్యింది. ధియేటర్ల గొడవలో బాలయ్య పంతం నెగ్గింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రధాన సెంటర్లలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇదంతా ఒక్క రోజు మురిపెం మాత్రమే. గురువారం బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ రాగానే ధియేటర్లన్నీ ‘నాన్నకు ప్రేమతో’ తీసేసి ఆ సినిమాను ప్రదర్శించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నవి 75 ధియేటర్లు కాగా వాటిలో తొలిరోజు దాదాపు 64 ధియేటర్లలో నాన్నకు ప్రేమతో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నగర పరిధిలో ఉన్న మల్టీప్లెక్స్‌లో అన్ని స్కీన్లలో కలిపి దాదాపు 35 సెంటర్లలో ఈ చిత్రాన్నే ప్రదర్శించనున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న ‘నేను..శైలజ’, ‘మామ మంచు..అల్లుడు కంచు’ వంటి చిత్రాలకు గట్టి దెబ్బ తగులుతోంది.

    ఒకరోజు ముచ్చట..

    జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రాలు ఒకరోజు వ్యవధిలో విడుదలవుతుండటంతో వాటికి ధియేటర్ల కేటాయింపు విషయంలో రాజకీయ వత్తిళ్ల కారణంగా వివాదం తెలెత్తిన విషయం విదితమే. తొలిరోజు భారీగా విడుదలవుతున్న జూనియర్ చిత్రం వైభవం మర్నాటికి మారిపోనుంది. ఈ మొత్తం ధియేటర్లను బాలయ్య ‘డిక్టేటర్’ ఆక్రమించనుంది. నాన్నకు ప్రేమతో చిత్రాన్ని నగరంలో మూడు ధియేటర్లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు సమాచారం. అవి కూడా పెద్దగా కలెక్షన్ సెంటర్లు కానివి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మల్టీ ప్లెక్స్‌లో మాత్రం కనీసం ఒక్క స్క్రీన్‌లోనైనా ప్రదర్శించేలా డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement