అల్లు అర్జున్ కాన్వాయ్‌లో అపశ్రుతి
ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరికిస్వల్ప గాయం
నిర్వాహకులపై త్రీ టౌన్‌లో కేసు నమోదు
విశాఖపట్నం: నగరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం నగరానికి వచ్చిన ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడంతో చినవాల్తేరు ప్రాంతానికి చెందిన చెన్నా సంగీతరావు స్వల్పంగా గాయపడ్డారు. బీచ్‌రోడ్డులోని తన తాత అల్లు రామలింగయ్య విగ్రహానికి పూల మాల వేయడానికి అల్లు అర్జున్ తన అభిమానులతో కలిసి ర్యాలీగా వెళుతున్న సమయంలో ఏడాదిన్నర పసిపాపతో వెళుతున్న సంగీతరావు ద్విచక్రవాహనాన్ని కాన్వాయ్ వాహనం ఢీకొంది. అయినప్పటికీ కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బాధితుడితోపాటు స్థానికులు ప్రైవేట్ కార్యక్రమం జరుగుతున్న నోవోటెల్ హోటల్ ముందు ఆందోళన చేపట్టారు.
లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోవడంతో కాసేపు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న ఏసీపీ నర్సింహమూర్తితోపాటు వన్ టౌన్, టూటౌన్, త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని అరుణ్‌బాబు అలియాస్ ఆర్య, కరుకు మోహన్‌కృష్ణ, తోట రమేష్‌లను త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి పంపించారు. అనంతరం బాధితుడు చెన్నా సంగీతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాన్వాయ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.