అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండు ప్రాంతంలో బస్సు కదులుతున్న సమయంలో దాడి జరిగిందని బాధితులు అంటున్నారు.
► అమర్‌నాథ్‌యాత్రలో విషాదం
► బస్సు ప్రమాదంలో 13 మంది కామారెడ్డివాసులకు గాయాలు
► గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రభావం అంటున్న సర్కార్
► టెర్రరిస్టులు దాడిచేశారంటున్న బాధితులు
► బాధిత కుటుంబాల్లో అయోమయం
► ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ
► త్వరగా రప్పిస్తామంటున్న ప్రభుత్వ విప్ గంప
సాక్షి, కామారెడ్డి: అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండు ప్రాంతంలో బస్సు కదులుతున్న సమయంలో దాడి జరిగిందని బాధితులు అంటున్నారు. బస్సుకు ఒకవైపు నుంచి బాంబులు దూసుకురావడంతో గాయాలపాలయ్యామని తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టించుకోకుండా గ్యాస్ సిలిండర్ పేలుడు అన్న మాట చెబుతుండడంతో బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్ పేలి ఉంటే బస్సు మొత్తం కాలి బూడిదయ్యేదని, అందులో ఉన్న అందరం దహనం అయ్యేవారమని బాధితులు అంటున్నారు.
యాత్రనుంచి తిరిగి వస్తుండగా..
గత నెల 27న కామారెడ్డికి చెందిన శ్రీ లక్ష్మీవెంకటేశ్వర టూర్స్ యజమాని ఓంప్రకాశ్ 45 మందితో కలిసి అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఆగ్రాకు చేరుకుని, అక్కడి నుంచి ట్రావెల్స్‌కు చెందిన బస్సును మాట్లాడుకుని వివిధ ప్రాంతాలను సందర్శించి, ఈ నెల 5న అమర్‌నాథ్‌కు చేరుకున్నారు. స్వామి దర్శనానంతరం 6న తిరుగు ప్రయాణమయ్యారు. అమర్‌నాథ్ నుంచి వస్తున్న సందర్భంలో ఖాజీగుండు ప్రాంతంలో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురైంది. బస్సులోకి చొచ్చుకువచ్చిన ఇనుపు ముక్కలు అందులో ఉన్న యాత్రికులకు గుచ్చుకున్నాయి.
చాలా మంది కాళ్లకు గాయాలయ్యాయని బాధితులు తెలిపారు. ఇందులో కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డికి చెందిన జంగం జయంతి (52) అనే మహిళ కాలికి తీవ్ర గాయమైంది. కామారెడ్డి పట్టణానికి చెందిన లక్ష్మీబాయి(42) అనే మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతనాగ్‌లోని స్కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా పదహారు మందిని ఖాజీగండ్ సీఆర్‌పీఎస్ క్యాంపులో ఉంచారు. మిగతా వారిని మరో రెండు చోట్ల క్యాంపుల్లో ఉంచారు. అయితే ఈ సంఘటనకు టెర్రరిస్టుల దాడే కారణమని బాధితులు చెబుతున్నారు.
ఇంటికి చేరేదాకా అయోమయమే..
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినవారిలో ఎందరు గాయపడ్డారు? గాయపడ్డవారి పరిస్థితి ఏంటి? అన్నదానిపై కూడా స్పష్టమైన వివరాలు వెల్లడి కావడం లేదు. తీవ్రవాదుల దాడిని ప్రభుత్వం ఎందుకు దాస్తుందోనని బాధిత కుటుంబాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామారెడ్డికి చెందిన ప్రభాకర్ భార్య జయంతి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిసింది. గురువారం రాత్రి క్షతగాత్రులు వీడియో కాల్ ద్వారా వారి పరిస్థితిని కుటుంబ సభ్యులు, బంధువులకు చూపించారు.
జమ్మూ అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ఎస్పీ..
గురువారం రాత్రి బాధిత కుటుంబాలకు ఈ విషయం తెలిసింది. వారు కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లను కలిసి తమ వారిని వెంటనే తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డిలు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సంఘటన జరిగిన జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. ఖాజీగడ్ సీఆర్‌పీఎఫ్ క్యాంపుతో పాటు మరో రెండు చోట్ల ఉన్న బాధితులందరినీ జమ్మూకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని కోరగా.. అక్కడి అధికా రులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వారందరినీ ఒక్క చోటుకి చేర్చి జమ్మూకి తరలించాలని, అనంతరం వారిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు గాని, ఢిల్లీకి గాని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
కేటీఆర్‌తో మాట్లాడిన ప్రభుత్వ విప్..
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి ఆపదలో చిక్కుకున్న వారిని రప్పించేందుకుగాను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. సీఎం కార్యాలయ అధికారుల ద్వారా జమ్మూ కశ్మీర్ అధికారులతో మాట్లాడించారు. బాధితులందరినీ క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు.
క్షేమంగా తీసుకువస్తాం..
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడితో మాట్లాడారు. బాధితులందరినీ క్షేమంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.