నేడు అమిత్‌షా రాక
నేడు అమిత్‌షా రాక
Published Fri, Nov 25 2016 9:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
తాడేపల్లిగూడెంలో రైతు మహాసభ
ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రానున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రైతు మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఇందుకోసం బీజేపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ప్రజా వ్యతిరేకత లేదని చెప్పేందుకు భారీగా జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసహనంతో చేస్తున్న వ్యాఖ్యలను సరైన సమాధానం ఈ వేదిక ద్వారా ప్రజలకు ఇవ్వాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. సుమారు లక్ష మంది రైతులు వస్తారని అంచనా వేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావుతోపాటు పలువురు నేతలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే ఈ సమావేశాన్ని తమ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఈ సభను విజయవంతం చేయడానికి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. అమిత్‌షా శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చేరుకుని అక్కడ రైతు ప్రతినిధులతో వారి సమస్యలపై చర్చిస్తారన్నారు. అనంతరం నాలుగు గంటలకు సభాస్థలి చేరుకుని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు.
Advertisement
Advertisement