అమ్మ మమతలా.. అంధకారంలో జ్యోతిలా | amma manasu nasa | Sakshi
Sakshi News home page

అమ్మ మమతలా.. అంధకారంలో జ్యోతిలా

Published Tue, Jul 26 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

అమ్మ మమతలా.. అంధకారంలో జ్యోతిలా

అమ్మ మమతలా.. అంధకారంలో జ్యోతిలా

  • అనాథ బాలలను సాకుతున్న  ‘లైట్‌ ఆఫ్‌ లవ్‌ చిల్డ్రన్‌ హోం’
  • ‘నాసా’ ప్రేమదాస్‌ బాటలో సోనీవుడ్, సౌమ్యల పయనం
  • ప్రస్తుతం 443 మందికి ఆశ్రయం
  • ఉచిత విద్య, వైద్య, వసతి సౌకర్యాలు
  • సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు
  •  
    ఆకలేసిన వేళ అక్కున చేర్చుకుని, గోరుముద్దలు తినిపించే, అలసిన రెప్పలు వాలిపోయే వేళ లాలిపాడి బజ్జోబెట్టే అమ్మా; ఆమెకు సైదోడుగా నిలిచి ఆలనాపాలనా చూసే నాన్నా, వారి మధ్య ముద్దు చేసే బంధువులూ.. ఇవన్నీ ఉన్న వారి బాల్యం.. జీవితాంతం నెమరేసినా తేనెలూరే జ్ఞాపకమై మురిపిస్తుంది. ఎన్నటికీ వాడని పువ్వై పరిమళిస్తుంది. మరి.. కన్నవారూ, ‘నా’ అన్నవారూ లేని బిడ్డల బాల్యం.. చేదుఫలమై వెగటేస్తుంది. వాడిములె్లౖ బాధిస్తుంది. కారుచీకటిలో సాగిన కబోది పయనంలా కష్టపెడుతుంది. అలాంటి అనాథల బతుకుల్లో ఆశాకిరణాలను ప్రసరింపజేస్తోంది..
     ‘లైట్‌ ఆఫ్‌ లవ్‌ చిల్డ్రన్‌ హోం’!
     
    తుని రూరల్‌ :
    తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్న ఎంతోమంది చిన్నారులకు తుని మండలం ఎస్‌.అన్నవరం శివారు జ్యోతినగర్‌లో ఉన్న లైట్‌ ఆఫ్‌ లవ్‌ చిల్డ్రన్‌ హోం అండగా నిలుస్తోంది. డైరెక్టర్‌ సోనీవుడ్, ఆయన భార్య డాక్టర్‌ సౌమ్య అనాథలను అక్కున చేర్చుకుని అన్నావదినలుగా ప్రేమానురాగాలను పంచుతూ, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. దివంగత ఎన్‌.హెచ్‌.ప్రేమదాస్, జ్యోతి ప్రేమదాస్‌ స్థాపించిన నాసా స్వచ్ఛంద సేవా సంస్థను గత 15 ఏళ్లుగా డైరెక్టర్‌ సోనీవుడ్‌ అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. ఎయిడ్స్, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు, పాముకాటు,  ఇతర కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుమాలిన వారైన 443 మంది పిల్లలకు ప్రస్తుతం  హోంలో విద్య, వైద్యం, భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు అందిస్తున్నారు. విద్యతోపాటు క్రీడలు, ఆటపాటల్లో ప్రావీణ్యం కల్పిస్తున్నారు. 
    మూడు వేల మందికి ఆసరా
    సంస్థ స్థాపించినప్పటి నుంచీ మూడు వేల మందికి బాలబాలికలకు ఆసరాగా నిలిచినట్టు డైరెక్టర్‌ సోనీవుడ్‌ తెలిపారు. కాగా వీరిలో 350 మంది పదో తరగతి, 200 మంది ఇంటర్మీడియట్, వందమంది ఐటీఐ, పాలిటెక్నిక్‌ డిప్లొమా, 90 మంది ఇంజనీరింగ్, బీఎస్సీ నర్సింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేశారు. హోంలో బాలబాలికలకు వేర్వేరుగా వసతి కల్పించారు. హెచ్‌ఐవీ సోకిన 30 మంది పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ వహించి పోషకాహారం అందిస్తున్నారు. అనాథలు ఎందరు వచ్చినాlచేర్చుకుని, విద్యాబుద్ధులు నేర్పించి, తన కాళ్లపై తాను నిలబడేలా తీర్చిదిద్దుతామని సోనీవుడ్‌ చెపుతున్నారు.
    రాఫా ఆధ్వర్యాన వైద్య సేవలు 
    రాఫా మెడికల్‌ సెంటర్‌ ద్వారా వుడ్‌ భార్య డాక్టర్‌ సౌమ్య చిన్నారులకు అన్నివేళలా వైద్య సేవలు, మందులను అందిస్తున్నారు.  ఆడ పిల్లల సంరక్షణ, కిషోర బాలికల అవసరాలపై ప్రత్యేక అవగాహనకు చైల్డ్‌ ప్రోటెక్షన్‌ పాలసీ రూపొందించి అమలు చేస్తున్నారు.
    విద్యకు పెద్దపీట
    అందరిలాగే తామూ విద్యలో దూసుకుపోవాలనుకునే అనాథబాలలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కంప్యూటర్‌ విద్య, లై్ర» రీ, సైన్స్‌ లేబొరేటరీ వంటి సదుపాయాలు కల్పించి, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. జాతీయస్ఫూర్తి నింపి, క్రీడల్లో ప్రావీణ్యం, ప్రతిభలను వెలికితీసేందుకు ప్రత్యేక క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు.
    మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సైకిల్‌ యాత్ర
    మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా గ్రామీణుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వందపైగా గ్రామాల్లో 300 కిలో మీటర్లు సోనీవుడ్‌ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. విద్య, వైద్యం, సామాజిక అంశాల ప్రాముఖ్యతపై గ్రామీణులకు అవగాహన కల్పించేందకు సదస్సులు నిర్వహించారు. హోంలోని బాలలకు యాత్రలో భాగస్వామ్యం కల్పించారు
     
    నర్సింగ్‌తో సేవలు అందిస్తున్నా 
    నా తల్లి గ్యాస్‌ స్టౌవ్‌ ప్రమాదంలో మరణించింది. అమ్మమ్మ ఈ ఆశ్రమంలో చేర్చింది. సేవ చేయాలన్న తపనను గుర్తించిన సోనీవుడ్‌ నర్సింగ్‌ చదివించారు. ఆశ్రయం కల్పించిన సంస్థలోనే ఉంటూ రాఫా మెడికల్‌ సెంటర్‌ ద్వారా పిల్లలకు సేవలు అందించే అవకాశం లభించింది.
    – సుకన్య, ఓల్డ్‌ స్టూడెంట్, రాఫా మెడికల్‌ సెంటర్‌
    సౌండ్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డా 
    తల్లిదండ్రులను కోల్పోయిన నన్ను 14వ సంవత్సరంలో సోనీవుడ్‌ చేరదీశారు. నాకు ఇష్టమైన సౌండ్‌ ఇంజనీరింగ్‌ చదివించారు. హైదరాబాద్‌లోని ఓ ఆడియో స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. తరచు హోంకు వచ్చి వెళుతున్నాను. కొంత ఆర్థికసాయం అందిస్తున్నాను.
    – కిషోర్, హోం ఓల్డ్‌ స్టూడెంట్‌ 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement