మంత్రి గారి వియ్యంకుడు.. నదిలో పాగా!
► అనుమతులు లేకుండానే నదిలో తిప్పేందుకు లాంచీ సిద్ధం ?
► బ్యారేజీ గేట్లకు పొంచివున్న ముప్పు అయినా ధనార్జనే లక్ష్యంగా ఏర్పాట్లు
► అన్నీ తెలిసినా నోరుమెదపని అధికారులు
ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకుల తీరు లక్షలాది మంది సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న బ్యారేజీ గేట్లకు ముప్పు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే కృష్ణానదిలో ఎటువంటి అనుమతులూ లేకుండా తిప్పుతున్న బోట్లకు తోడు మరో భారీ లాంచీని కూడా సిద్ధం చేశారు. దీనికి అనధికారికంగా ప్రారంభోత్సవం కూడా చేసేశారు. ఎలాంటి అనుమతులూ లేకపోయినా నదిలో తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
సాక్షి, అమరావతి : ప్రకాశం బ్యారేజీ గేట్లకు ముప్పు పొంచి ఉంది. 70 టన్నుల పైనే బరువు గల భారీ లాంచీని నిబంధనలకు విరుద్ధంగా నదిలో తిప్పేందుకు రంగం సిద్ధం చేయటమే దీనికి కారణం. దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులూ లేవు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర మంత్రి వియ్యంకుడిది కావడంతో దీనిపై అధికారులు కూడా నోరుమెదపడం లేదు. లాంచి, బోట్లను కృష్ణానదిలో తిప్పేందుకు వినియోగిస్తే బ్యారేజీ గేట్లకు ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకెళితే... 1884లో బ్రిటీష్ హయాంలో ప్రారంభించిన కృష్ణా బ్యారేజీ 1957 నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ఈ బ్యారేజీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటికి వరప్రదాయినిగా మారింది. సుమారు 14 లక్షల ఎకరాలకు సాగు నీరందించటంతో పాటు వందలాది గ్రామాలు, నగరాలు, పట్టణాలకు తాగునీరు అందిస్తోంది.
గతంలో బ్యారేజ్ గేట్లు మూడడుగులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 12 అడుగుల గేట్లు 70 ఉన్నాయి. ఒక్కో గేటు సుమారు 50 టన్నుల బరువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ, గేట్ల రక్షణను దృష్టిలో ఉంచుకుని నదిలో ఎటువంటి లాంచీలు, బోట్లు తిప్పకూడదని నిబంధనలు ఉన్నాయి. బ్రిటీష్ వారి హయాంలో నిర్మించిన కట్ట, మూడడుగుల గేట్లను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో చట్టం చేసినట్లు సమాచారం. అనుమతులు లేకుండా బోట్లు, లాంచీలను నదిలో తిప్పితే అప్పట్లో 50 పైసలు అపరాధ రుసుం విధించేవారని తెలుస్తోంది. ప్రస్తుతం అటువంటి నిబంధనలేవీ అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం కృష్ణానదిలో అనధికారికంగా 150 బోట్లు తిప్పుతున్నట్లు సమాచారం. వీటికితోడు తాజాగా రాష్ట్ర మంత్రి బంధువు లాంచీని నదిలో తిప్పేందుకు సిద్ధం చేశారు. ఇటీవలే అనధికారికంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ లాంచీ బరువు 70 టన్నులపైనే ఉంటుందని, ఐరన్ వరకే 60 టన్నులని సమాచారం. లాంచీ ఎత్తు 22 అడుగులు, పొడవు 40 అడుగులు ఉంది.
పొంచివున్న ముప్పు...
ప్రస్తుతం నదిలో నడుపుతున్న బోట్లకు తోడు లాంచీని కూడా తిప్పితే బ్యారేజీ గేట్లకు ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. వరదలు వచ్చి, పెద్ద గాలులు వీస్తే నీటితో పాటు లాంచీ బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకునే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. భారీ లాంచీ కావడంతో దాని బరువు, నీటి అలలు, గాలి ఉధృతికి గేట్లను ఢీకొంటే అవి దెబ్బతినే ప్రమాదముందని చెబుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ.. ఈ నెల ఆరున కురిసిన భారీ వర్షానికి నదిలో ‘0’ పాయింట్ వద్ద తాడుతో కట్టి ఉంచిన లాంచీ గాలికి తిరగబడింది. దీంతో విజయవాడ మారుతీనగర్‌కు చెందిన తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ (48) లాంచీ కిందపడి మరణించాడు. సుమారు 70 టన్నులకు పైగా ఉన్న లాంచీని ప్రస్తుతం చిన్న చిన్న తాడులతో బండకు కట్టి ఉంచటం గమనార్హం.
పెద్ద గాలి వీస్తే తాడు తెగి లాంచీ కొట్టుకుని వెళ్లి బ్యారేజీ గేట్లను గుద్దుకునే అవకాశముంది. 70 టన్నుల లాంచీ గుద్దితే గేటు 50 టన్నుల సామర్థ్యం ఉన్న గేటు ఎటువంటి పరిస్థితుల్లో నిలిచే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణానదిలో లాంచీని ఉంచితే ప్రమాదం ఉందని అధికారులకు తెలిసినా నోరెత్తటానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం లాంచీని కృష్ణాలో అద్దెకు నడిపేందుకు సిద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. లాంచీలో వినోదాలు, విహారం, ఫంక్షన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజుకు లాంచి అద్దె రూ.3 లక్షలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
బ్యారేజీని తాకితే ఇబ్బందే
కృష్ణానదిలో ఏర్పాటుచేసిన లాంచీ ప్రమాదవశాత్తూ బ్యారేజీని తాకితే ఇబ్బందులు ఎదురవుతాయి. మత్స్యకారు ల వలలకూ ఇబ్బందే. ఇవన్నీ ఆలోచించకుండా అధికారులు లాంచీని నదిలోకి ఎలా దిగనిచ్చారో మరి. - ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే