ఇచ్చిందేంటి బాబూ?!
ప్రియతమ ముఖ్యమంత్రి గారికి,
అయ్యా!
‘అనంత’ కరువు, వెనుకబాటుతనం గురించి మీకు తెలియంది కాదు. మీరు గతంలో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో ఏడేళ్లు వరుస కరువులతో జిల్లా తల్లడిల్లింది. జనం ఆకలి తీర్చడానికి గంజికేంద్రాలు, పశువుల కోసం గడ్డికేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి రెండేళ్లుగా కరువు నెలకొంది. ఈ రెండేళ్లలో 63 మండలాల్లోనూ కరువొచ్చిందని మీ ప్రభుత్వమే ప్రకటించింది. జిల్లా ప్రజలు గడిచినlఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు, 12మంది ఎమ్మెల్యేలను మీ పార్టీ తరఫున గెలిపించారు. రాజధాని ప్రకటన సమయంలో ‘అనంత’ అభివృద్ధి కోసం 15 వరాలను అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించారు.
ఇవి కాక జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మరో ఆరు హామీలిచ్చారు. ఇది చూసి ‘మీకు అనంత అంటే ఎంత ప్రేమో’ అనుకున్నాం. మీరు ఇప్పటి వరకూ 11 సార్లు జిల్లాకు వచ్చారు. నేడు 12వ సారి వస్తున్నారు. కాగా.. మీరిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారు. పైగా వచ్చిన ప్రతిసారీ ‘అనంత’ అంటే నాకు అమితమైన ప్రేమ.. మొన్న చైనాకు వెళుతుంటే కలలో కూడా ‘అనంతే’ గుర్తుకొచ్చిందంటూ వల్లమానిన ‘అభిమానం’ చూపుతారు. ప్చ్..ఏం లాభం?! మీ మాటలు నీటి మూటలే అవుతున్నాయి.
హంద్రీ–నీవా ద్వారా 2014 ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీళ్లిస్తామన్నారు. ఇవ్వలేదు. 2015కైనా ఇచ్చారా? అదీ లేదు! ‘2016 ఆగస్టుకు నీళ్లివ్వాల్సిందే! పనులు చేయాల్సిందే! లేదంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతా. అధికారులపై చర్యలు తీసుకుంటా’ అని ఇటీవల దిగువచెర్లోపల్లికి వచ్చినపుడు హడావుడి చేశారు. కానీ మొదటివిడత ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు కాంట్రాక్టర్లకు మీరే వచ్చే ఏడాది జూన్ వరకూ గడువిచ్చారు. జరుగుతున్న పనులు చూస్తే మరో మూడేళ్లయినా పూర్తయ్యేలా లేవు. దీన్నిబట్టి చూస్తే మీ మాటలు నేతిబీరలో నెయ్యి చందం అనుకోక తప్పదు. కేంద్రం ఫసల్‌బీమాను ప్రవేశపెట్టింది. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో వేరుశనగను చేర్చారు.
‘అనంత’లో మాత్రం ఎత్తేశారు. రైతులపై మీకు అభిమానమే ఉంటే, వారికి మేలు చేయాలని సంకల్పమే ఉంటే ‘అనంత’ వేరుశనగను ఫసల్‌బీమాలో ఎందుకు పెట్టించలేదు? కనగానపల్లి మండలం దాదులూరు దగ్గర గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తొలి వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకటించారు. ఇప్పుడు దాని ప్రస్తావనే లేదు. గుజరాత్‌లోని జునాఘడ్ వేరుశనగ పరిశోధన సంస్థకు అనుబంధంగా ఎన్‌పీ కుంటలో ప్రాంతీయ పరిశోధన కేంద్రం, బుక్కరాయసముద్రంలో నూనె గింజల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రూ. వెయ్యి కోట్లతో అనంతను హార్టికల్చర్‌హబ్‌గా మారుస్తామన్నారు. ఇవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఎయిమ్స్ అనుబంధ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఊరించి.. చివరకు గుంటూరుకు తరలించారు.
మీ రెండేళ్ల పాలన ఎలా సాగిందో! రెండు ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన ‘అనంత’ ప్రజలకు ఎలాంటి మేలు చేశారో మీరు ఏరోజైనా ఆత్మపరిశీలన చేసుకున్నారా?! సంపూర్ణ రుణమాఫీ చేయనందున రెండేళ్లలో 154మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలకు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదు. 24 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయనందుకు ఐదు వేలకుపైగా గ్రూపులు డిఫాల్టయ్యాయి. ఈ రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా? ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? అర్హత ఉన్నా పింఛన్లు తొలగించారు.
రెండేళ్లలో ఏ ఒక్కరికీ ఇళ్లు నిర్మించలేదు. ఇంటి స్థలమూ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండేళ్లలో మీ పార్టీనేతలు మాత్రమే ఆర్థికంగా బలపడ్డారు తప్ప, ఏ ఒక్క సామాన్యునికీ మేలు జరగలేదు. ఇప్పటికీ బెంగళూరు, కేరళ, తమిళనాడులో వలసెళ్లిన రైతులు, కూలీలు ఉన్నారు. ఇప్పటికైనా మీరు రైతులు, పేదల కష్టాలు చూడండి. నిజంగా రెండేళ్లలో ఏం చేశారో సమీక్షించండి. ‘అనంత’ను సింగపూర్ చేయాల్సిన పనిలేదు. తాగు, సాగునీరు ఇవ్వండి చాలు. వలసలు పోకుండా బతికేందుకు పని కల్పించండి. పిల్లలకు మంచి చదువు, సామాన్యులకు వైద్యం అందించండి. మా వినతులు ఆలకించి, సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ..
– ‘అనంత’ ప్రజలు