ఇన్‌పుట్‌పై అదేమాట
– ఇన్సూరెన్స్ లేదా ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని సీఎం పునరుద్ఘాటన
– ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు ద్వారా ఏపీ ఖజానాపై భారం రూ.45 కోట్లు మాత్రమే
– తక్కిన మొత్తం బజాజ్ కంపెనీ, కేంద్రం వాటానే
– ‘అనంత’ పర్యటనలో చంద్రబాబు ప్రకటనతో సుస్పష్టమైన పరిహారం లెక్కలు
– కరువు జిల్లాపై కనికరం చూపని సీఎం
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ గురించి ‘అనంత’ రైతులకు ఉన్న అవగాహన రాష్ట్రంలోని మరే జిల్లా రైతులకూ ఉండదు. ఎందుకంటే జిల్లాలో ఏటా పంటనష్టం జరుగుతోన్నా కాస్తోకూస్తో ఉపశమనం లభిస్తోంది వీటివల్లే! అయితే.. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం ‘అనంత’ రైతులను నిలువునా మోసం చేస్తోంది. కరువు దెబ్బకు విలవిలలాడిపోతున్న అన్నదాతలపై ఏమాత్రమూ కనికరం చూపడం లేదు.
ఇన్సూరెన్స్ అనేది ఓ కంపెనీకి సంబంధించిన వ్యవహారం. మనం స్కూటర్‌కొని ఇన్సూరెన్స్ చేస్తాం. ప్రమాదం జరిగితే సదరు కంపెనీ మనకు పరిహారం చెల్లిస్తుంది. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. వాతావరణ బీమాలోనూ ఇదే వర్తిస్తుంది. రైతులు బజాజ్ అలయంజ్ కంపెనీకి ప్రీమియం చెల్లించారు. పంట నష్టపోతే ఆ కంపెనీ పరిహారం ఇస్తుంది. అయితే.. బీమా పరిహారాన్ని కూడా తామే ఇస్తున్నట్లు చంద్రబాబు ‘అనంత’ రైతులను మోసం చేస్తున్నారు. 2016 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.1,070 కోట్ల మేర పంట నష్టం జరిగిందని, ఎకరాకు రూ.6వేల చొప్పున పరిహారం చెల్లించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో కేంద్రం తన వాటాగా రూ. 535 కోట్లు విడుదల చేయనుంది. తక్కిన రూ.535 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా విడుదల చేయాలి. ఇదిలావుండగా, బజాజ్ కంపెనీ జిల్లాకు రూ.367 కోట్ల ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించింది.అయితే.. తాజాగా అన్ని పంటలకూ కలిపి రూ.450 కోట్ల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధమైనట్లు తెలిసింది.
కేంద్రం ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ఇచ్చే రూ.535 కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే రూ.450 కోట్లు కలిపితే రూ.985 కోట్లు అవుతుంది. సీఎం చంద్రబాబు మాత్రం పామిడిలో గురువారం జరిగిన బహిరంగ సభలో తాము జిల్లా రైతులకు పరిహారం రూపంలో రూ.1,030 కోట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రం, బజాజ్ కంపెనీ ఇచ్చే రూ.985 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.45కోట్లు కలిపి.. మొత్తం రూ.1,030 కోట్లు రైతులకు ఇవ్వనున్నారు. అయితే..అంతా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందన్నట్లు చంద్రబాబు ప్రకటించుకున్నారు. ‘అనంత’ చరిత్రలో ఇప్పటి వరకూ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీకి లంకెపెట్టి రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. అసంబద్ధ విధానాలతో రైతులను మోసం చేసే మొట్టమొదటి ప్రభుత్వం ఇదే అవుతోందని ప్రతిపక్షాలు, రైతుసంఘాలు దుయ్యబడుతున్నాయి. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పరిహారంపై పామిడి సభలో చంద్రబాబు ఏదైనా ప్రకటన చేస్తారని రైతులు ఆశించారు. వారి ఆశలను సీఎం అడియాసలు చేశారు.
పేరూరు, బీటీపీలను ఈ ఏడాదే పూర్తి చేస్తాం : సీఎం
సీఎం చంద్రబాబు గురువారం నీరు–ప్రగతి ఉద్యమం రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవం కోసం పామిడికి వచ్చారు. నీరు–ప్రగతి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆపై స్టాళ్లను సందర్శించారు. తర్వాత స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువను కర్నూలు జిల్లా ముచ్చుమర్రి నుంచి జీడిపల్లి వరకూ మొదటి విడతలో వెడల్పు చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను పాత, కొత్త కలెక్టర్లు శశిధర్, వీరపాండ్యన్‌లకు అందించారు. పేరూరు, బీటీ ప్రాజెక్టు పనులను కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదా ఇన్సూరెన్స్ రూపంలో రైతులకు రూ.1030 కోట్ల పరిహారం ఇస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటసాగు చేసే సమయానికి ఆ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
గుత్తి నియోజకవర్గంలో 12 చెరువులకు నీళ్లు అందించేందుకు రూ.40కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కసాపురంలో టూరిజం సర్క్యూట్‌కు మరో రూ.20కోట్లు కేటాయిస్తామన్నారు. పామిడి, గుత్తిలో డిగ్రీకాలేజీల ఏర్పాటు, గుంతకల్లులో పాలిటెక్నిక్ కాలేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ముఖ్యమంత్రి వద్ద ఏకరువు పెట్టారు. అన్నీ పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సభ అనంతరం నేరుగా అనంతపురం చేరుకుని కేటీఆర్ కళ్యాణమంటపంలో నీటిసంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. నీటి ఆవశ్యకత, సంరక్షణపై ప్రసంగించారు. ఆపై శిల్పారామాన్ని ప్రారంభించారు. శిల్పారామాన్ని రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన పార్కులా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అక్కడి నుండి నేరుగా పుట్టపర్తికి చేరుకుని తిరుగుపయనమయ్యారు. పర్యటనలో మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, నారా లోకేశ్, విప్ యామినీ బాల, ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, పల్లె రఘునాథరెడ్డి, ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, తిప్పేస్వామి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.