అండర్ - 16 క్రికెట్ ఫైనల్స్‌లో అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ - 16 టెస్టు క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు అనంత జట్టు చేరింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తూర్పు గోదావరి జట్టుతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ లీడ్‌తో ఫైనల్లో తన బెర్తును ఖరారు చేసుకుంది. మ్యాచ్ చివరిరోజైన ఆదివారం తూర్పుగోదావరి జట్టు 9 వికెట్లకు 111 పరుగులతో ఆట ప్రారంభించింది. రెండు పరుగులు చేస్తూనే వికెట్ పడిపోవడంతో 113 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో అనంత బౌలర్లు కామిల్ 5, మీరజ్‌కుమార్ 4, గణేష్‌రెడ్డి 1 వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. జట్టులో యోగానంద 75, గురురాఘవేంద్ర 63, అర్జున్ టెండూల్కర్ 42, మహేంద్రరెడ్డి 39 పరుగులు చేశారు. ఈ నెల 5 నుంచి 7 వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విశాఖపట్టణం - అనంతపురం జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.
టోర్నీలో మెరిసిన యోగానంద, కామిల్, అర్జున్ టెండూల్కర్
ఈ టోర్నీలో అనంత జట్టు ఫైనల్‌కు చేరడంలో యోగానంద, కామిల్‌ల పాత్ర కీలకమైనది. యోగానంద మెరుగైన కెప్టెన్సీతోపాటు తన పదునైన ఆటతీరుతో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో సఫలమయ్యాడు. ఈ మూడు రోజుల టెస్ట్ టోర్నీలో ఇప్పటివరకు 563 పరుగులు చేశాడు. కామిల్ తన ఆల్‌రౌండ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు 35 వికెట్లు తీశాడు. 292 పరుగులు సా«ధించాడు. టోర్నీలో యోగానందకు మంచి సపోర్ట్ అందించిన మరో బ్యాట్స్‌మెన్ అర్జున్ టెండూల్కర్ 349 పరుగులు సాధించడం కూడా జట్టుకు చాలా ఉపయోగపడింది.