పీఏల సాయంతో దోచుకుంటున్నారు
హిందూపురం అర్బన్ : మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కుమారులు, పీఏలను అడ్డుపెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుని పాలన చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వంలో శనివారం చిలమత్తూరు మండలంలోని కొడికొండ గ్రామంలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి టీడీపీ హామీల అమలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు మాటలకు మాత్రమే పరిమితమై తనయుడు లోకేష్‌కు పాలన అప్పగించారని విమర్శించారు. ఇదేlపద్ధతిలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వారి తనయులు, పీఏలను పీఏలను అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను గాలికి వదిలేసి రౌడీలను తమ అనుచరులుగా చెప్పుకుంటున్నారన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు రేషన్, పింఛన్ అందటం లేదని, డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ కాలేదంటూ వాపోతున్నారని చెప్పారు.
జిల్లాకు ఏం చేశారు..?
ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఇద్దరు ఎంపీలను గెలిపించారు. కానీ వారందరు జిల్లాకు ఇంతవరకు చేసిందేమీ లేదని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల ప్రజలను తుంగలో తొక్కేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.