కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అడ్డుగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అడ్డుగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుని, ఇరు రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కడుతున్నాయని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష వేదికపై ఆయన మాట్లాడారు.
కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో తాగడానికి నీళ్లు కూడా రావని అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా కింద పంటలసాగు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. రాయలసీమ ప్రజలు ఇప్పటికే కరువుతో అల్లాడుతున్నారని, నీళ్లు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెప్పారు.