‘అనంత’ను పారిశ్రామిక వాడగా మారుస్తాం
అనంతపురం అర్బన్: ‘అనంత’ని పారిశ్రామిక వాడగా మారుస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం స్థానిక వైద్య కళాశాల ఆడిటోరియంలో పారిశ్రామిక, సేవారంగంలో ప్రగతి- భవిష్యత్ ప్రణాళిక అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లెరఘునాథ్‌రెడ్డిలు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 1400 డాక్టర్ పోస్టుల భర్తీ చేశామన్నారు. జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ధేందుకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.
ఇప్పటికే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, బెల్, ఎయిర్‌బస్, రాగమయూరి, తదితర కంపెనీలు జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తునాయన్నారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించామన్నారు. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కానుందన్నారు. ఆర్థిక, సామాజిక, పారిశ్రామికంగా ఎదగాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. సదస్సులో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, తదితరులు పాల్గొన్నారు.