
‘మకి’నా?.. మలేసియానా?
అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వ భవనాల సముదాయానికి సంబంధించిన డిజైన్ల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. గతంలో జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌ను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఖరారు చేసి తప్పులో కాలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని వదులుకోలేక మరొకరిని ఎంచుకోలేక సతమతమవుతోంది. మకి డిజైన్లపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రత్యామ్నాయంగా మన దేశ ఆర్కిటెక్ట్‌లు, మలేసియాకు చెందిన హారీస్ ఇంటర్నేషనల్ కంపెనీ రూపొందించిన డిజైన్లను పరిశీలించినా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.
రాయపూడి సమీపంలో 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భవనాలు ఎలా ఉండాలనే దానిపై 8 నెలల క్రితం అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ల పోటీకి తెరలేపింది. లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్, మన దేశానికి చెందిన వాస్తు శిల్ప కన్సల్టెంట్, జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్ పోటీ పడగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ ‘మకి’ డిజైన్‌ను ఎంపిక చేసింది. దాన్ని ఆమోదించిన ప్రభుత్వం ఏడాదిలోగా పూర్తిస్థాయి డిజైన్లు ఇచ్చేలా ఆ కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు పావులు కదిపింది. ఈలోపు అసెంబ్లీ భవనం డిజైన్ పరిశ్రమల్లోని పొగ గొట్టాల్లా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ‘మకి’ని ఎంపిక చేయలేదని ప్రకటించింది.
అనంతరం సీఆర్‌డీఏ ఆర్కిటెక్ట్‌ల ప్యానల్‌తో సమావేశమై హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లను ఇక్కడి సంస్కృతికి అనుగుణంగా రూపొందించాలని కోరింది. వారు అద్భుతమైన డిజైన్లు రూపొందించినా.. ‘మకి’ డిజైన్‌లో భాగంగానే వీటిని చూస్తామని చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. మరోవైపు తాజాగా హారీస్ ఇంటర్నేషనల్(మలేసియా) ఇచ్చిన డిజైన్లను సర్కారు పరిశీలించింది.
విమర్శలపాలైన జపాన్ డిజైన్‌ను ఎంపిక చేయాలా, లేక మలేసియాకు తలొగ్గాలా, అద్భుతంగా ఉన్న ఇండియన్ ఆర్కిటెక్ట్‌ల డిజైన్లను ఉపయోగించుకోవాలా అనే దానిపై సర్కారు తర్జనభర్జనలు పడుతోంది. డిజైన్ ఇంకా ఖరారు కాకపోవడంతో షెడ్యూల్ ప్రకారం 2018 డిసెంబర్ కల్లా నిర్మాణాన్ని పూర్తి చేయడం అసాధ్యమని సీఆర్‌డీఏ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.