చింతలపూడి.. మరో సింగరేణి
చింతలపూడి.. మరో సింగరేణి
Published Wed, Sep 21 2016 9:03 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
–అన్వేషణ ఫలించింది
–అపార బొగ్గు నిల్వలు ఉన్నట్టు నిర్ధారణ
చింతలపూడి: ఆంధ్రా సింగరేణిగా చింతపూడి ప్రాంతం నిలవనుంది. రాష్ట్రంలో బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో బొగ్గు నిల్వల అన్వేషణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్‌ఎంఈటీ)తో ఎంవోయూ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గు వెలికితీసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
సింగరేణి కన్నా నాణ్యమైన నిల్వలు
జిల్లాలోని చింతలపూడి మండలం వెంకటాపురం, నామవరం గ్రామాలు, కష్ణా జిల్లా సోమవరం ప్రాంతాల్లో జీఎస్‌ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్‌ఐ చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. ఆరు నెలల పాటు జరిపిన సర్వేలో ఇక్కడ సింగరేణి కన్నా నాణ్యమైన బొగ్గు ఉందని తేలిందని జీఎస్‌ఐ డ్రిల్లింగ్ ఆపరేటర్లు మోతీలాల్‌దె, బ్రహ్మలింగం తెలిపారు.
2 వేల మిలియన్ టన్నులు
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం, సోమవరం గ్రామం నుంచి జిల్లాలోని చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు తాజా సర్వేల ద్వారా వెల్లడయ్యింది. భూ ఉపరితలానికి 200 నుంచి 500 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
మూడేళ్ల క్రితమే గుర్తించారు
లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి జిల్లాలోని చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిల్వలు ఉన్నాయని నివేదికలో కూడా పేర్కొన్నారు. ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారం¿¶ మైతే ఏడాదికి 8 వేల మెగావాట్ల చొప్పున 60 ఏళ్లపాటు విద్యుత్ కొరత ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement